రోగాలపై అప్రమత్తత అవసరం
రాయగడ: రోగం సంక్రమించక ముందే అప్రమత్తతతో వ్యవహరించాలని సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘమిత్రాదేవి అన్నారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురష్కరించుకుని స్థానిక సెంచూరియన్ ఫార్మసీ విభాగానికి చెందిన విద్యార్థులు మంగళవారం నిర్వహించిన అవగాహనర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక గజపతి కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జీసీడీ మైదానం వరకు కొనసాగింది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఫార్మసి విభాగానికి చెందిన డాక్టర్ చంద్ర శేఖర్ పాత్రో, అధ్యాపకులు గోపాలకృష్ణ పాడి, అవినాష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
ఏనుగు బాధితులకు
పరిహారం ఇస్తాం
పర్లాకిమిడి: కాశీనగర్ సమితిలోని జైగుడ గ్రామంలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆనంద్ తెలిపారు. కాశీనగర్‌లో ఏనుగుల సంచారంపై ట్రాక్ చేస్తూ, టాటా విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపడుతున్నామని ఆయన అన్నారు. ఏనుగులు పంట పొలాలు నాశనం చేస్తున్నాయన్న ఫిర్యాదులపై డీఎఫ్‌ఓ ఆనంద్ స్పందిస్తూ దీనిపై పంట నష్టపరిహారం అంచనాలు వేస్తున్నామని, 45 రోజుల్లోగా నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.
మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభం
రాయగడ: స్థానిక రైల్వే గ్రౌండ్‌లో మంగళవారం జిల్లా స్థాయి మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభమైంది. రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలొ కలెక్టర్ ఫరూల్ పట్వారి, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదంలో
వలలు దగ్ధం
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తదిబ్బలపాలెం సముద్ర తీరంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో చేపల వలలు దగ్ధమయ్యాయి. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్ తాళ్లతో ఉన్న వలలకు నిప్పంటుకోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో వలలు కాలిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు చీకటి పండువాడు, రాము, సూరాడ కూర్మయ్య, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత అక్టోబర్ 21న డి.మత్స్యలేశం తీరంలోనూ ఇలాగే వలలు కాలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందో కారణం తెలియలేదు. ప్రమాదమా? వ్యక్తిగత కక్షలతో నిప్పుడు పెడుతున్నారా అన్నది తెలియడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment