ఏహెచ్‌పీ లబ్ధిదారులకు కేటాయింపు పత్రాల పంపిణీ
భువనేశ్వర్: నగరంలో సరసమైన గృహ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణం, నగర అభివృద్ధి విభాగం మంత్రి డాక్టరు కృష్ణ చంద్ర మహాపాత్రో కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. స్థానిక ఇడ్కో ఆడిటోరియంలో మంగళ వారం జరిగిన లాటరీ కార్యక్రమంలో అర్హులైన వారికి మంత్రి ఈ పత్రాల్ని ప్రత్యక్షంగా అందజేశారు. రాజధాని నగరంలో ఇల్లు కలిగి ఉండడం సామాన్యునికి అతి పెద్ద కల. ప్రభుత్వం సగటు మనిషి కలని సాకారం చేసే దిశలో ఈ చర్యపట్ల చొరవ తీసుకున్నట్లు మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. చంద్రశేఖర పూర్, నీల మాధవ్ ఆవాస్, సుబుద్ది పూర్ ప్రాంతాల్లో సరసమైన గృహ ప్రాజెక్టు పథకం నగర బీదల కోసం ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. ఈ ప్రాజెక్టుల కింద సమగ్రంగా 116 మందికి మంత్రి కేటాయింపు పత్రాలు అందజేశారు. చంద్రశేఖర పూర్ ప్రాంతంలో 47, నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 36, సుబుద్ధి పూర్ ప్రాంతంలో 28 ఇళ్లకు సంబంధించి కేటాయింపు పత్రాలు జారీ చేయడం పూర్తయ్యింది.
చంద్రశేఖర పూర్ ప్రాంతం 20 ఎకరాల విస్తీర్ణంలో 2,600 ఇళ్ల నిర్మాణం చేపట్టి 820 నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో 737 మందికి అర్హులుగా పరిగణించి కేటాయింపు లేఖలు అందజేశారు.
స్థానిక కేర్ ఆస్పత్రి చేరువలో నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 8.18 డెసిమల్ విస్తీర్ణపు స్థలంలో చేపట్టిన 1,200 ఇండ్ల నిర్మాణంలో 960 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 543 మంది అర్హులకు అందజేశారు. సుబుద్ధి పూర్ బరుణై ఎంక్లేవ్ ప్రాజెక్టు కింద 342 ఇండ్లు నిర్మించడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద 28 ఇళ్ళ నిర్మాణం పూర్తి కావడంతో అర్హులైన లబ్దిదారులకు కేటాయించారు. స్థానిక సత్య నగర్ ప్రాంతం 10 ఎకరాల సువిశాల విస్తీర్ణపు స్థలంలో కేశరి రెసిడెన్సీ బీదల వాడ పునరాభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ స్థలంలో 1,300 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా 560 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 454 మంది లబ్ధిదారులకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment