సబ్ కలెక్టర్ అరెస్ట్
భువనేశ్వర్: ఢెంకనాల్ కామాక్ష్య నగర్ సబ్ కలెక్టర్ నారాయణ చంద్ర నాయక్‌ని మంగళవారం విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా లెక్కాజమ లేని ఆస్తులు ఆర్జించినట్లు అతనికి వ్యతిరేకంగా ఆరోపణ. సోమవారం నిర్వహించిన సోదాల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో అరెస్టు చేసినట్లు వివరించారు. సోదాల్లో భాగంగా భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో 3 బహుళ అంతస్తు భవనాలు, 14 ఇళ్ల స్థలాలు, 365 గ్రాముల బంగారం, రూ.34,57,000 బ్యాంకు పొదుపు ఖాతాలో నిల్వ, రూ.1.48 లక్షల నగదు స్వాధీనపరచుకున్నారు.
బ్రిటిష్ వంతెనపై హెచ్చరిక బోర్డులు
కొరాపుట్: కొరాపుట్–నబరంగ్‌పూర్ జిల్లాలను విడదీస్తున్న ఇంద్రావతి నది పై బ్రిటిష్ వారు ఇనుప వంతెన నిర్మించారు. ఆ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. దాని మీద వాహనాలు రాకపోకలు లేనప్పటికీ పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ప్రమాదకర గోతులు కనిపిస్తున్నాయి. వీటిని గమనించిన నబరంగ్‌పూర్ పట్టణానికి చెందిన ఐకాన్స్ ఇన్ మొషన్ష్ యువజన సంస్థ సభ్యులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
5టి పాఠశాలల పరిశీలన
రాయగడ: గత ప్రభుత్వం అమలు చేసిన 5టి పథకంలో భాగంగా అభివృద్ధి చెందిన వివిధ పాఠశాలలను బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా మునిగుడలొ గల నొడల్ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన 5టి పథకంలొ మంజూరైన నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సమితి ఏఈఓ ఐఽశ్వర్య భంజదేవ్ ఈ సందర్భంగా పాఠశాలలో గల వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నిధుల నుంచి అదనపు తరగతి గదులను నిర్మించేందుకు హామీ ఇచ్చారు.
25న అఖిల పక్ష సమావేశం
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఖరారైంది. శాసనసభలో ఆమె అధ్యక్షతన ఈ సమావేశం ఈనెల 25వ తేదీన జరుగుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మంగళవారం తెలిపారు. శాసనసభ శీతాకాలం సమావేశాలు పురస్కరించుకుని అఖిల పక్షాలతో స్పీకర్ సమావేశం కానున్నట్లు మంత్రి వివరించారు. ఈనెల 26వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు ఆరంభం అవుతాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో 25 పని దినాలు ఉంటాయి. పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. విపక్షాల అభ్యర్థనలపై సమర్ధవంతంగా స్పందించేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉందని మంత్రి ముఖేష్ మహా లింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విడత సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌ని సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.
కొరాపుట్ @7.9 డిగ్రీల ఉష్ణోగ్రత
కొరాపుట్: జిల్లాలో కనీస స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 7.9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది. దీంతో చలిపులి పంజా విసిరింది. సాయంత్రం 6 గంటలకే ప్రజలు ఇళ్లకి పరిమితం అవుతున్నారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల్లో ప్రయాణికులు అల్పంగా ఉంటున్నారు. కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక అగ్గిమంట వద్ద చలి కాచుకుంటూ, ప్రస్తుతం రాజకీయ వాతావరణం కూడా చల్లబడి పోయిందని సామాజిక మాద్యమాల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment