● ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు
విజయనగరం: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పోటీలు విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, విజయనగరంలోని పీవీజీ రాజు కాంప్లెక్స్, విజ్జి స్టేడియంలలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్‌లు డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. టోర్నమెంట్‌లో అస్సాం, రైల్వేస్, చండీగఢ్, పాండిచ్చేరి, విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జట్లు పోటీపడనున్నాయి. ఆయా జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఇండియా, ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ పోట్లీల్లో పాల్గొననున్నారు.
బోధనేతర పనులు
రద్దు చేయాలి
పార్వతీపురంటౌన్: పాఠశాలల్లో బోధన సమయాన్ని పెంచేందుకు విద్యాశాఖ, హైస్కూల్ పని వేళల సమయాన్ని పెంచడాన్ని యూటీఎఫ్ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీ మోహనరావు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతున్నాయని, మార్చిన సమయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్లు కొనసాగుతాయని, దీనివలన ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ ఉన్నాయని, కావున సమయం పెంచడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. బోధనేతర కార్యక్రమాలు, యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కల్గిస్తే బోధన సమయం పెరుగుతుందన్నారు. కావున వెంటనే ఈ పని వేళలు పెంచే ఆలోచనను విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని తెలియచేశారు.
పశువుల లారీ సీజ్
దత్తిరాజేరు: పార్వతీపురం నుంచి విజయనగరం కబేళాకు 32 పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ బూర్జవలస ఎస్సై జి.రాజేష్ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి కొంతమంది కబేళా వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు చౌదంతివలస కూడలి వద్ద పట్టుకున్న లారీలో తినడానికి గడ్డి లేకుండా తాగడానికి నీరు లేకుండా కాళ్లు కట్టేసి ఉన్న పశువులను స్వాధీనం చేసుకుని పశువుల యజమాని గణేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment