జాతీయ స్థాయి పోటీలకు ఏకలవ్య పాఠశాల విద్యార్థినిలు
సాలూరు: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పాచిపెంట మండలంలోని కొటికిపెంట ఏకలవ్య పాఠశాల నుంచి 12 మంది విద్యార్థినిలు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ దేవేందర్‌సింగ్ శనివారం తెలిపారు. ఈ నెల 20, 21, 22న అనంతగిరిలోని ఏకలవ్య పాఠశాలలో 4వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరగ్గా ఈ పోటీల్లో 28 ఏకలవ్య పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్ తదితర విభాగాల్లో 6 గోల్డ్, 6 సిల్వర్, చాంపియన్ ట్రోఫీ గెలుపొందారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినిలను ప్రిన్సిపాల్‌తో పాటు పీఈటీ, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
పూరిపాక దగ్ధం
భామిని: చలి తీవ్రత నుంచి రక్షణకు వేసిన చలి మంటతో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి వృద్ధ దంపతులు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. పూరిపాక కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. భామిని మండలం కోసలిలో కుప్పిలి రామయ్య, రవణమ్మ వృద్ధ దంపతులు. వీరు నివసిస్తున్న పూరిపాక శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అదే సమయంలో పాకలో నిద్రిస్తున్న వృద్ధులు అప్రమత్తమై బయటపడ్డారు. రాత్రి వేసిన చలిమంట ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు. ఎంఆర్‌ఐ కొట్టుగుమ్మడి కృష్ణారావు, వీఆర్‌ఓ బిడ్డికి గోపాల్ ప్రమాద స్థలాన్ని సందర్శించి కారణాలు తెలుసుకున్నారు. నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలిపారు.
ఇద్దరు మైనర్లపై కేసు నమోదు
సంతకవిటి: ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేసి శ్రీకాకుళంలోని జువైనల్ కోర్టులో శనివారం హాజరుపరచినట్లు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కుతీబస్ నాయక్ రాజాంలోని ఓ జ్యూట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో రాజాం బస్టాండ్‌లో బస్ దిగి డోలపేట వైపు నడుచుకుంటూ వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్, 1500 రూపాయలను తీసుకుని పరారైనట్టు శనివారం సంతకవిటిి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. సీసీ పుటేజ్‌ల ఆధారంగా 24 గంటల్లోనే ముద్దాయిలను పట్టుకున్నామని తెలిపారు.
వృద్ధురాలి ఆత్మహత్య
బాడంగి: మండలంలోని గొల్లలపేటకు చెందిన రాపాక గౌరమ్మ(55) అనే వృద్ధురాలు విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తమ పంట కల్లంలో ఈ నెల 14న పురుగుల మందు తాగి గౌరమ్మ ఆత్మహత్యకు పాల్పడగా అపస్మారక స్థితికి చేరడంతో బంధువుల సహాయంతో స్థానిక సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వరుసకు సోదరుడైన రాపాక గౌరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తారకేశ్వరరావు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు తెలిపారు.
అంకితభావంతో పని చేయండి : జేసీ
సాలూరు: ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ శోభిక అన్నారు. పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సర్వీసులు ,శాఖాపరంగా జరుగుతున్న పనులపై ఆరా తీసారు. అనంతరం పట్టణంలో జీసీసీ గోదాంను పరిశీలించారు. సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మండలంలో శివరాంపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖి చేసారు. ట్రక్ షీట్, రికార్డులు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ వెంకటరమణ, ఏఓ అనురాధ, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment