మహతాబ్ బహుముఖ రాజనీతిజ్ఞుడు
భువనేశ్వర్: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ హరే కృష్ణ మహతాబ్ బహుముఖ రాజనీతిజ్ఞుడని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. హరే కృష్ణ మహతాబ్ 125వ జయంత్యుత్సవం పురస్కరించుకుని స్థానిక రబీంద్ర మండపంలో శనివారం ప్రసంగించారు. ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది. జాతిపిత మహాత్మా గాంధీ ప్రేరణతో 1921లో రెవెన్షా కళాశాలలో చదువు సంధ్యలకు స్వస్తి పలికి దేశ స్వాతంత్ర సమరంలో ముందంజ సేనగా హరే కృష్ణ సారథ్యం వహించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్రానికి ముందు 1946 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక ఒడిశా ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. మహా నాయకుని 125వ జయంత్యుత్సవాల్ని ఏడాది పాటు నిరవధికంగా జాతీయ స్థాయిలో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఇటీవల జాతీయ స్థాయిలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని హరే కృష్ణ మహతాబ్ జీవిత గాథ ఇతివృత్తంగా బయోపిక్ చిత్రీకరణ కోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సాహితీవేత్తలకు సత్కారం
ఈ సందర్భంగా సాహితీ రంగంలో ఉన్నతంగా రాణించిన ముగ్గురు ప్రముఖులకు మహతాబ్ సాహితీ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా 7 పుస్తకాల్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వీటిలో మ్యాన్ ఆఫ్ డెస్టినీ, మహా నాయక్ మహతాబ్, శిశు లెఖా (మహతాబ్ రచన), మహతం మహతాబ్, మహతాబ్ ఎబొం అనన్య కృతి, గాంవ్ మజ్లిస్ పుస్తకాలు ఉన్నాయి. సాహితీవేత్తలుగా శంకర్ లాల్ పురోహిత్, నిషామణి కొరొ, గోబింద చంద్ర చాంద్ మహతాబ్ సాహితీ పురస్కారంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సందర్శించారు. ఆయనతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment