డిసెంబరు 8 నుంచి చైతీ ఉత్సవాలు
రాయగడ: ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న చైతీ ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 8 నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలోని పద్మపూర్ సమితి పరిధి మొరిచొగుడ గ్రామంలోని అక్షర బ్రహ్మ మందిరం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతికి వారి ఆచార, సాంప్రదాయాలు, కళా సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు.
జిల్లాస్థాయి
విజ్ఞాన ప్రదర్శన
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి భుజబల్‌లో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రైతా మాట్లాడుతూ.. విద్యార్థుల మేధాశక్తిని పదునుపట్టేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ ఫ్రొఫెసర్ రామానుజ నాయక్ మాట్లాడుతూ తమ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో 42 పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. దిల్ సే–24 పేరిట నిర్వహించిన ఈ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించిందన్నారు.
లేబర్ కార్డుల రిజిస్ట్రేషన్
మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ఆండ్రాహల్ పంచాయతీలో ఎక్కువగా బోండ తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. దీంతో వారికి ఆండ్రాహల్ పంచాయతీ కార్యాలయం వద్ద బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్క్‌ర్స్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన శిబిరం శనివారం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వారికి లేబర్ కార్డుల్లో రిజిస్ట్రేషన్ చేశారు. జిల్లా లేబర్ అధికారి ప్రసన్న పాణిగ్రాహి, అదనపు లేబర్ అధికారి పూర్ణిమ దురుక సమక్షంలో 150 మంది హాజరవ్వగా వారికి రిజిస్ట్రేషన్ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment