పైపుల కార్ఖానాలో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఝార్సుగుడ బెహరా పల్లి ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో పైపుల ఉత్పాదన సంస్థ రియాన్ పాలిటెక్నిక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్ఖానాకు చెందిన వ్యర్థ పదార్థాల పోగులో నిప్పు రగిలి పొగలు కమ్మాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్మడంతో స్థానికులు బెంబేలెత్తారు. అగ్ని మాపక దళం ఘటనా స్థలం సందర్శించి మంటలు నివారించింది.
మంటల్లో స్కూటీ దగ్ధం
భువనేశ్వర్: పరుగులు తీస్తున్న స్కూటీ ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. త్రిశూలియా వంతెనపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. త్రిశూలియా నుంచి కటక్ వెళ్తున్న స్కూటీ నుంచి అసాధారణ మంటలు రావడంతో దూకేసి స్కూటీని వదిలేశానని డ్రైవరు తెలిపాడు. విద్యుత్ షార్టు సర్క్యుట్‌తో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక అగ్ని మాపక దళం ఘటనా స్థలానికి చేరి మంటలు ఆర్పింది. ఇదంతా ముగిసే సరికి స్కూటీ కాలిపోయింది.
పాత్రోపుట్ మృతుల
వివరాలు లభ్యం
జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ పంచాయతీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురి వివరాలు తెలిశాయి. మరణించిన వారిలో ఇద్దరు విద్యార్థులు మిగతా ఇద్దరు పెద్దవారు. బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీ బితరకోట్ కోలనీ దొబా పొరజ్(30), అతడి సోదరుని కుమారుడు ధనపతి ఉరఫ్ బుటి పొరజ(16)ఆ గ్రామంలో ఘాశీ పొరజ(12), కోకినాథ్ పోరజ(18)లు మృతి చెందారు. ధనపతి పొరజ, ఘాసీ పొరజలు మహుళి ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఈ నలుగురు ఒక బైక్‌పై పొలం పనులు చేసేందుకు వెళ్తుండగా 326 విజయవాడ–రాంచీ జాతీయ రహదారిలో ట్రక్కు బైక్‌ను ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. హృదయ విదారకమైన ఈ ప్రమాదం బితరకోట్ కాలనీలో విషాదం నింపింది.
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
కొరాపుట్: ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కెల్లార్ జంక్షన్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ప్రయాణం చేస్తున్న ప్రశాంత్ ఖోస్లా (30), అరుణ్ టక్రి (32) తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు వారిని లక్ష్మీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. సంఘటన స్థలానికి వెళ్లి లక్ష్మీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment