ఘనంగా రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం
రాయగడ: స్థానిక సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొని శపథం చేశారు. జిల్లా జడ్డి సత్యనారాయణ షొడంగి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
లారీ బోల్తా
రాయగడ: జిల్లాలోని టికిరి ప్రాంతం నుంచి కర్రల లోడుతో జేకే పేపర్ మిల్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి గుమ్మా ఘాటీ మలుపు వద్ద బోల్తా పడింది. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్, హెల్పర్లకు స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాల తెలియాల్సి ఉంది.
వలస కార్మికుడి మృతి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితికి చెందిన మరో వలస కార్మికుడు కేరళ రాష్ట్రంలో మృతి చెందాడు. మృతుడు కాసీపూర్ ప్రాంతానికి చెందిన సింధూరఘాటి పంచాయతీలోని సనొచెకన గ్రామానికి చెందిన హరపూల్ మాఝి(34) గా గుర్తించారు. ఇటీవల దసరా పూర్తయిన తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఉపాధి కోసం కేరళలోని త్రిసూర్ వెళ్లాడు. ఈ క్రమంలో పనులను నిర్వర్తించుకుని త్రిసూర్‌లో ఉంటున్న తమ గదికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన సమాచారాన్ని తోటి స్నేహితులు మాఝి కుటుంబానికి తెలియజేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బాధితుని కుటుంబీకులు జిల్లా కార్మిక, ఉపాధి కార్యాలయానికి వేడుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అంత దూరం నుంచి తాము మృదేహాన్ని తీసుకు వచ్చే స్తోమత లేకపోవడంతో ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు అందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
అవినీతి ఆరోపణలపై ఫారెస్టర్ అరెస్టు
జయపురం: ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు స్వాహా చేసిన ఆరోపణపై కుంధ్ర సమితి ఫారెస్టు రేంజ్‌లో ఫారెస్టర్ రమేష్ చంధ్ర భొత్రతో పాటు గ్రామ సాథీ మహేంధ్ర ఖొరలను అరెస్టు చేసినట్లు జయపురం విజిలెన్స్ వర్గాలు మంగళవారం వెల్లడించారు. వారిపై ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించటంతో అరెస్టు చేసి జయపురం స్వతంత్ర విజిలెన్స్ కోర్టులో హాజరుపరచారు. ఇద్దరినీ కోర్టు డిసెంబర్ 7 వరకు రిమాండ్‌కు పంపించిందని జయపురం విజిలెన్స్ ఎస్పీ ప్రద్యుమ్న కుమార్ ద్వివేది వెల్లడించారు. బాగ్‌దేరీ సెక్షన్ అడవిలో పనులు జరిపేందుకు అటవీ విభాగం నిధులు మంజూరు చేసింది. ఆ పనుల్లో కార్మికులను నియమించినట్లు ఫారెస్టర్, గ్రామ సాథీలు చూపించి రూ.11,44,150 బిల్లు చేశారు. కార్మికుల అకౌంట్‌లలో బిల్లుల ప్రకారం జమ చేశారు. అనంతరం వారు కార్మికుల నుంచి రూ.10,60,125 వసూలు చేశారు. దీంతో కార్మికులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సంజయ ప్రధాన్ టీమ్ దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కేవలం రూ.84 వేల విలువైన పనిమాత్రం జరిగినట్లు తేలింది. మిగతా డబ్బు ఫారెస్టర్, గ్రామ సాథీ లు కలసి స్వాహా చేసినట్లు వెల్లడి కాగా విజిలెన్స్ కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేసి వారిని స్పెషల్ విజిలెన్స్ కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment