బీజేపీకి ఓటు వేయనందుకు వెలివేత
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదన్న ఆక్రోషంతో గ్రామం నుంచి వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబాలు తమ గోడుని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లినా స్పందించకపోవడంతో, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన ప్రదర్శించారు. దీంతో ఈ ఉదంతం బట్టబయలైంది. రాజకీయ కక్షతో గ్రామస్తులను సామాజిక బహిష్కరణకు గురి చేసిన సంఘటన పూరీ జిల్లా నిమాపడా మండలం పాలశ్రీ గ్రామంలో చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదని పాలశ్రీ గ్రామంలోని 4 కుటుంబాలకు సామాజిక బహిష్కరణకు గురి చేశారు. ఈ కుటుంబాల్లో సుమారు 20 మంది సభ్యులు గత కొద్ది నెలలుగా ఈ వెలివేత వేధింపుల మధ్య సతమతం అవుతున్నారు.
ఓటు వేయాలని ఒత్తిడి
గత ఎన్నికల్లో కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని వీరిపై ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడికి తలొగ్గకుండా స్వేచ్ఛగా స్వీయ అభీష్టం మేరకు ఓటు వేశారు. దీంతో ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చిన వర్గం ప్రస్తుతం పలు రకాల బెదిరింపులతో హెచ్చరిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక బాధిత వర్గం పూరీ జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమ గోడుని విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో మన్మోహన్ ప్రధాన్ ఆధ్వర్యంలో వెలివేత ఎదుర్కొంటున్న మరో 3 కుటుంబాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. వీరి కుటుంబాలకు గ్రామంలో సామాజిక బహిష్కరణ అమలు చేసి వంటా వార్పునకు వీలు లేకుండా నీరు, నిప్పు వంటి సౌకర్యాలు బలవంతంగా దూరం చేశారు. చివరకు గ్రామంలోని దేవాలయంలోనికి సైతం ప్రవేశించకుండా అడ్డగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు నిరసన ప్రదర్శనకు దిగడంతో నిమాపడా తహసీల్దార్ స్పందించారు. వీరి ఆరోపణపై తక్షణమే విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు న్యాయం చేయకుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తామంతా సామూహికంగా ఆత్మాహుతికి పాల్పడతామని బాధితులు హెచ్చరించారు.
బాధిత కుటుంబాల నిరసన
Comments
Please login to add a commentAdd a comment