గంజాయి వ్యాపారుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయొద్దు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
విజయనగరం క్రైమ్: గంజాయి వ్యాపారం ద్వారా ఆస్తులు కూడబెట్టిన వ్యక్తుల నుంచి ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయవద్దని ప్రజలకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అక్రమ వ్యాపారాలతో కూడబెట్టిన ఆస్తులను, వారి నుంచి తిరిగి ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, అమ్మకాలు నిర్వహించి, ఆస్తులు కూడబెడితే వాటిని సీజ్ లేదా జప్తు చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతుందన్నారు. రేంజ్ పరిధిలో ఇటువంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే గుర్తించామని, వారి ఆస్తులను సీజ్ చేసేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఏమైనా నూతనంగా ఆస్తులు కొనుగోలు చేసే ముందు సదరు విక్రయదారులు ఆయా ఆస్తులు ఏ విధంగా సంక్రమించాయి, వాటి చట్టపరమైన స్ధితిని ముందుగా ధ్రువీకరించుకోవాలన్నారు. లేకుంటే కొనుగోలుదారులు చట్టపరమైన, ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుపోతారన్నారు. అటువంటి ఆస్తులతో కూడిన లావాదేవీలతో కొనుగోలుదారులకు చట్టపరమైన తీవ్ర పరిణామాలు తప్పవని సూచించారు. ఇదేరకంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పడాల నాగేశ్వరరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా గంజాయి వ్యాపారం సాగించి, తన పేరున, భార్య పేరున 15.36 ఎకరాల భూములు కొనుగోలు చేశారని, సదరు భూమి విలువ రూ.62.80 లక్షలు ఉంటుందని విచారణలో వెల్లడైందన్నారు. ఈ ఆదాయం అక్రమ సంపాదనగానే గుర్తించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment