ఎమ్మెల్యే తనయుడి వాహనం ఢీకొని..
● నలుగురికి తీవ్ర గాయాలు
● కొరసవాడ యాతపేట వద్ద ఆటోను ఢీకొన్న స్కార్పియో
● ఇద్దరి పరిస్థితి విషమం
పాతపట్నం: మండలంలోని కొరసవాడ యాతపేట సమీపంలో జాతీయ రహదారిపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయిగణేష్ ప్రయాణిస్తున్న స్కార్పియో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్పల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం శివశంకర్ కాలనీలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు సింగ ఆనంద్ శనివారం మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన చెప్పల బోగయ్య, సంతు, సవలాపురం నరేష్, గణేష్‌లు కలిసి ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్‌తో కలిసి వచ్చారు. పరామర్శ అనంతరం స్వగ్రామం తిరిగి వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొరసవాడ యాతపేట సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి ఎదురుగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు మామిడి సాయి గణేష్ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీ కొట్టింది. ఆటో బోల్తాపడగా.. స్కార్పియో పక్కనే ఉన్న టేకు తోటలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురితో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సాయిగణేష్, డ్రైవర్ రాజేష్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న సీఐ వి.రామారావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు. వైద్యులు మన్మధరావు, విక్రమ్, దేవిప్రసాద్‌లు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్సకోసం అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చెప్పల బోగయ్యకు, చెప్పల సంతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment