ప్రతీ పాఠశాలలో స్కౌట్స్, గైడ్స్‌ను ప్రవేశపెట్టాలి
బొబ్బిలి రూరల్: పాఠశాలలోని విద్యార్థులకు మానసిక పటుత్వంతో పాటు వికాసం, శారీరక ధైర్యం, దేశభక్తిని తెలియజేయాలంటే ప్రతీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు ఎన్సీసీని ప్రవేశపెట్టాలని డెల్టా సంఘ అధ్యక్షుడు మింది విజయమోహనరావు డిమాండ్ చేశారు. మండలంలోని అలజంగి ఎంపీపీ పాఠశాలలో ఆ సంఘ సభ్యులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో ప్రాధమిక హక్కులు, సామాజిక బాధ్యత, స్వీయ రక్షణ తదితర అంశాల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పొలానికి వెళ్లి..
విగతజీవులుగా మారి..
జియ్యమ్మవలస: వారిది ఉమ్మడి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. ఇంటిల్లిపాదీ ఆరుగాలం పొలంలో శ్రమిస్తూ కుటుంబాలను నెట్టుకువస్తున్నారు. ఇప్పుడు ఆ పొలంలోనే ఒక్కొక్కరుగా తనువుచాలిస్తుండడం కలవరపరుస్తోంది. ఐదేళ్ల కిందట పెద్దన్నయ్య కృష్ణ పొలంలోనే మృతి చెందగా.. ఇప్పుడు పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వైకుంఠపు శ్రీను (45), సింహాచలం(43) ఎస్టీ మరువాడ వద్ద ఉన్న పొలంలో రబీ వరి పంట కోసం నారుమడి సిద్ధం చేసేందుకు శనివారం ఉదయం వెళ్లారు. ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. మోటారు వేసే సమయంలో సపోర్టు వైరుకు విద్యుత్ ప్రసరించడం, దానికి వారు తగలడంతో షాక్‌కు గురై మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. మృతుల్లో శ్రీను ఇద్దరు కుమారుల్లో చక్రధర్ ఎంసీఏ చేస్తుండగా వెంకటేష్ ఐటీఐ చదివి ప్రైవేటు ఉద్యోగంలో ఇటీవల చేరాడు. సింహాచలంకు రమ్య అనే పాప డిగ్రీ చదువుతుండగా రమేష్ ఐటీఐ చదువుతున్నాడు. ఐదేళ్ల కిందట మృతిచెందిన కృష్ణకు ఇద్దరు అమ్మాయిలు ఉండగా వారికి పెళ్లళ్లు జరిగాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. మృతుల తండ్రి మరణించగా తల్లి మహాలక్ష్మి ఉంది. ఇంటికి పెద్ద దిక్కును మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసన్నకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment