కత్తులతో బెదిరించి దోపిడీకి యత్నం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని నిత్యం రద్దీగా ఉండే కిన్నెర కాంప్లెక్సు సమీపంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించి మరీ దోపిడీయత్నానికి పాల్పడ్డారు. ఒకటో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిన్నెర కాంప్లెక్సు సమీపంలోని కాకివీధి పాయింట్ వద్ద వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంటికి గేటు తీసుకుని ఇద్దరు, పెరడు నుంచి మరో దుండగుడు కాయగూరలు కోసే కత్తులతో వెళ్లి చొరబడ్డారు. కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించసాగారు. ఈలోగా గోవింద్ కుటుంబసభ్యులు ఇంట్లో ఉన్న కర్రలను, కత్తి పీటలను అందుకుని ప్రతిఘటించారు. కేకలు విని స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు.డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, క్లూస్ టీమ్ సిబ్బందితో చేరుకు పరిసరాలను పరిశీలించారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న గోవింద్ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు వచ్చారా? లేక గోవింద్ ఇంటిపక్కనే హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం ఉండటంతో అందులో చోరీకి వచ్చారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పైడపునాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment