సాగునీటి సంఘాల నిర్వహణలో నిర్లక్ష్యం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ సమితి నీలాపూర్‌లో జలసంపద శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాగునీటి సంఘాల పక్షోత్సవాలు సోమవారం నిర్వహించారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాశీనగర్, గుసాని సమితిల్లో సాగునీటి సంఘాల పాయింట్ల నిర్వాహణలో అనేక లోపాలు, నిర్లక్ష్యధోరణి అధికారుల్లో కనిపిస్తోందని విమర్శించారు. పాణి పంచాయతీల పక్షోత్సవాలు నేపథ్యంలోమట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. ఇరిగేషన్ ఇంజనీర్ మహారాణా మాట్లాడుతూ కృష్ణసాగరం కుడి, ఎడమ గేట్లు పరిశీలించామని, త్వరలోనే పూడిక తీత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద పాణి పంచాయతీల పక్షోత్సవాల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, గుమ్మ బ్లాక్ చైర్మన్ సునేమి మండళ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment