జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్న జయపురం ఎమ్మెల్యే
జయపురం: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అకాల మరణానికి చింతిసూ ఈ నెల 30వ తేదీన తన జన్మదిన వేడులను రద్దు చేసుకున్నట్టు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా అభిమానులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణుల సమక్షంలో పుట్టిరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేవాళ్లమన్నారు. ఈసారి వేడులను రద్దు చేసుకున్నానని.. ఎవరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
కొరాపుట్: ట్యూషన్ కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధి లడ్‌గాంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రధ్యుమ్న నారాజి, అరుణ్ పాలీ, కె.సునీల్ ట్యూషన్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాక పోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
అడ్డుకున్నా.. ఆగలేదు..!
● రైలుకిందపడి వ్యక్తి బలవన్మరణం
రాయగడ: రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని అక్కడ ఉన్నవారు అడ్డుకున్నప్పటికీ విషాదం తప్పలేదు. అక్కడకు కొద్ది క్షణాల్లోనే మరో రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన రాయగడ మజ్జిగౌరి మందిరానికి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయగడ మజ్జిగౌరి అమ్మవారిని ఛతీస్‌గఢ్ రాష్ట్ర ఖైతపతి గ్రామానికి చెందిన శివరామ్ యాదవ్ (46) దర్శించుకున్నాడు. అనంతరం పూటుగా మద్యం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. అయితే సమీపంలో ఉన్న కొంతమంది అతన్ని గమనించి అడ్డుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చేశారు. అయితే అక్కడకు కొద్ది సేపటి తరువాత మరో గూడ్స్ రైలు వస్తుండగా పరుగున వెళ్లి దాని కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుక్ను రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
దక్షిణకాళి, పాతాళేశ్వర మందిరాల్లో చోరీ
రాయగడ: జిల్లాలోని తెరువలి పంచాయతీ పాయికొపొడ గ్రామంలోని దక్షిణకాళి, పాతాళేశ్వర మందిరాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు మందిరాల్లో చొరబడి హుండీల్లోని సుమారు 15 వేల రుపాయల నగదుతో పాటు 500 గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించినట్లు చందిలి పోలీసులకు గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఎప్పటిలాగే పూజారి మందిరాల తలుపులను ఆదివారం తెల్లవారుజామున తెరిచేందుకు వెళ్లారు. అయితే అప్పటికే మందిరాలకు వేసి ఉన్న తలుపులు తెరచి ఉండడంతో పాటు తాళాలు విరిగి కింద పడి ఉండటాన్ని గమనించారు. దీంతో చోరీ జరిగి ఉంటుందనే అనుమానంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్నకుమార్ బెహర, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment