రోడ్డు భద్రతా వారోత్సవాల చైతన్య శకటం ప్రారంభం
పర్లాకిమిడి: జనవరి ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ గజపతి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల చైతన్య రథాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని సమితి కేంద్రాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు చైతన్య పరుస్తోందన్నారు. దీనితో పాటు జాతీయ రోడ్డు భద్రతా ఛాయాచిత్రాలు కూడా అనేక చోట్ల ప్రదర్శిస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసన్న కుమార్ దాస్ అన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారిస్తామని, సీటు బెల్టుపెట్టుకోని వాహనదారులకు జరిమానా విధిస్తామని జిల్లా రవాణా శాఖ సూపరింటెండెంటు తుషార్ హేంబ్రమ్ అన్నారు. కార్యక్రమంలో సీడీఎంవో డాక్టర్ ఎం.ముబారక్ ఆలీ, ఏడీఎం రాజేంద్ర మింజ్ ఉన్నారు.
రాయగడలో..
రాయగడ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రచార రథాన్ని కలెక్టర్ ఫరూల్ పట్వారి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వారం పాటు జరిగే భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించాలన్నారు. అత్యధిక శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడం దారుణమన్నారు. ఆర్‌టీఒ శివశంకర్ చౌదరి మాట్లాడుతూ ప్రతీ కూడలిలోనూ వాహన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment