రేపు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం
● నేడు రాష్ట్రానికి రాక
భువనేశ్వర్: రాష్ట్ర నూతన గవర్నర్‌గా డాక్టర్ కంభంపాటి హరిబాబు ఈ నెల మూడో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన గురువారం భువనేశ్వర్ చేరుకుని పూరీలోని జగన్నాథస్వామివారి దర్శించుకుంటారు. భారత రాష్ట్రపతి ఆమోదం మేరకు రఘుబర్ దాస్ స్థానంలో మిజోరాం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హరిబాబు రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. కొత్త గవర్నర్ ఇంజినీర్, అధ్యాపకునిగా విశేష గుర్తింపు సాధించి రాజకీయాల్లో అనుభవజ్ఞునిగా పేరొందారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా 24 సంవత్సరాల అనుభవం సాధించారు. 2023 అక్టోబర్ 18న రఘుబర్ దాస్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. పదవీ కాలానికి ముందే ఆయన రాజీనామా చేయడంతో భారత రాష్ట్రపతి ఆమోదంతో కొత్త గవర్నరు నియమితులయ్యారు.
పశువైద్యశాలలకు
మందుల సరఫరా
విజయనగరం ఫోర్ట్: ప్రాంతీయ, గ్రామీణ, సంచార పశువైద్యశాలల్లో మందుల కొరతతో మూగ జీవాల వైద్యానికి ప్రైవేటు వెటర్నరీ మెడికల్ షాపుల్లో రైతులు మందులు కొనుగోలు చేస్తున్నారన్న అంశంపై గత నెల 30న ‘మూగజీవాల వైద్యానికి మందుల్లేవ్’ అనే శీర్షిక ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. పశువైద్యశాలలకు మందులు సరఫరా చేశారు.
ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి
● రైతుసంఘ నాయకులు
భామిని: మండలంలోని వడ్డంగి వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, మండల అధ్యక్షుడు బోగాపురపు అప్పలనాయుడు, కార్యదర్శి భూపతి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో ఎండిపోయిన చెరువులను స్థానిక రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కరువు రైతులపై దృష్టి సారించాలని సూచించారు. గతంలో 2019 ఎన్నికల ముందు టీడీపీ నాయకులు హుటాహుటిన కాట్రగడ–బి వద్ద ఎత్తిపోతల పథకానికి శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో పథకం పూర్తి చేయాలని కోరారు. సాగునీరందక పంటలు పాడవుతున్నాయని, పాలకులు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు బోదెపు రఘుపతినాయుడు, బోదెపు శేషగిరి, నీటి సంఘ అధ్యక్షుడు బోదెపు సుధాకర్, ఉపాధ్యక్షుడు గార మోహనరావు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment