గొడ్డలితో నరికి వృద్ధుడి హత్య
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బొదాపుట్ పంచాయతీ అమటిగుడ గ్రామంలో గొడ్డలితో నరికి ఒక వృద్ధుడిని హత్య చేశారు. వృద్ధుడి మృతదేహం సమీప అడవిలో పడి ఉంది. ఆ వృద్ధుడు ఆ గ్రామానికే చెందిన సదన పంగి అని వెల్లడైంది. అతడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే మృతదేహం ఉన్న ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించామని బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ వెల్లడించారు. పోలీసు అధికారిణి వివరణ ప్రకారం..
బొయిపరిగుడ సమితి దశమంతపూర్ పంచాయతీ గాడపుట్ గ్రామానికి చెందిన సదన పంగి నెల రోజులుగా కుమార్తె నయన వద్ద ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఎవరో దుండగులు అతడిని గొడ్డలితో నరికి హత్య చేసి బొదాపుట్ పంచాయతీ అమటిగుడ సమీప అడవిలో పారవేశారు.
ఈ విషయం గురువారం దెడాసూర్ గ్రామంలో గల బంధువు హరి హంతాల్ సదన కుమార్తె నయనకు కబురు చేశాడు. వెంటనే ఆమె బంధువులు, కుటుంబ సభ్యులతో వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూసి విలపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే సంఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. సదన్‌ను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకు, ఎవరు హత్య చేశారు అన్నది స్పష్టం కావటంలేవని పోలీసు అధికారి వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారికి బొదాపుట్ సర్పంచ్ జమున నాయిక్, దశమంతపూర్ సర్పంచ్ రోహిత్ కుమార్‌లు సహకరిస్తున్నారు. హంతకులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment