పాఠశాలలో దొంగతనం
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని బుట్టిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం పాఠశాల పూర్తయిన అనంతరం పాఠశాల గదులకు తాళంవేసి సిబ్బంది అంతా వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం స్కూల్‌కు సిబ్బంది చేరుకున్నారు. అనంతరం హెచ్‌ఎం గదిని తెరిచేందుకు వెళ్లే సమయానికే ఆ గది తాళం పగలుగొట్టిన ఆనవాలు ఉన్నాయి. దీంతో ఇతర ఉపాధ్యాయులను పిలిచి చూపించారు. అనంతరం లోపల చూడగా బీరువా తెరిచి ఉంది. అలాగే పేపర్లు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీకి సమాచారం ఇచ్చారు. అనంతరం మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం ఐఐసీ రీగాన్‌కీండో తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. దీనిలో భాగంగా ముఖ్యమైన రికార్డులు చోరీకి గురైనట్లు నిర్ధారించారు.
అడవుల్లో అగ్ని ప్రమాదాలు అరికట్టాలి
జయపురం: అడవుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. స్థానిక అటవీ విభాగ అధికారి కార్యాలయంలో ఒడిశా ప్రభుత్వ అటవీ పరిరక్షణ జలవాయు పరివర్తన విభాగ అధికారి డా.ప్రతాప్ కుమార్ బెహర అధ్యక్షతన జయపురం అటవీ డివిజన్‌లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు డివిజన్ స్థాయి అధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా విక్రమదేవ్ వర్సిటీ విజ్ఞాన విభాగ అధ్యాపకుడు ప్రశాంత కుమార్ పాత్రో మాట్లాడుతూ.. అటవీ పర్యావరణం రక్షణ, వన్య జంతువుల రక్షణ, అడవుల విస్తరణ, వాటి పరిరక్షణ మొదలగు విషయాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఏసీఎఫ్‌వో డా.అమిత్ కుమార్ నాయిక్, జయపురం అటవీ విభాగ అధికారి సచ్చిదానంద పొరిడ, బొరిగుమ్మ అటవీ అధికారి డొంబురుదొర గొమాంగో, కోట్‌పాడ్ అటవీ అధికారి బిద్యుత్ బిశ్వాస్, కుంద్ర అటవీ అధికారి బి.ఎన్.మండిక, బొయిపరిగుడ అటవీ అధికారి సందీప్ పాణిగ్రాహి, గుప్తేశ్వర అటవీ అధికారి రామచంద్ర నేపక్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా మనోజ్‌కుమార్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కొత్త వ్యక్తిగత కార్యదర్శిగా మనోజ్‌కుమార్ సాహు నియమితులయ్యారు. ఈయన 2006 సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన వ్యక్తి. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యాటకుల సందడి
పర్లాకిమిడి: పట్టణానికి దాదాపు 25 కి.మీ దూరంలో రాయఘడ బ్లాక్ గంగాబడ పంచాయతీలో ఉన్న గండాహతి జలపాతం వద్ద పర్యాటకుల సందడి పెరిగింది. అక్కడి వాతావరణం ఆస్వాదించడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు విచ్చేస్తున్నారు. పర్లాకిమిడి నుంచి ఫారెస్టు జంక్షన్, అడాసింగి మీదుగా గండాహతి చేరుకోవడానికి ఒడిశా ఆర్‌అండ్‌బీ శాఖ మంచి రోడ్డును నిర్మించారు. మందస– మెళియాపుట్టి రోడ్డు మీదుగా కూడా గండాహతి జలపాతాలకు చేరుకోవచ్చు. ఇటీవల గండాహతి జలపాతం వద్ద ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌లు కూడా చేస్తుండటం విశేషం. మహేంద్రగిరి పర్వతాల నుంచి వచ్చే ఈ జలపాతాలు సహజ సిద్ధమైనవి. పర్యాటకులు ఇక్కడ విడిది చేయడానికి ఫారెస్టు శాఖ కాటేజీ కూడా నిర్మించింది. కార్ పార్కింగ్, పిక్నిక్‌లకు అనువుగా ఉన్న ప్రదేశం ఉండటం వల్ల వారాంతపు సెలవుల్లో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment