కాల్పుల కలకలం
● జాజ్‌పూర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు ● నగదు కాజేసేందుకు వచ్చి కాల్పులు ● ఇద్దరు మృతి
భువనేశ్వర్: నగదు దోచుకునే ప్రయత్నంలో దుండగులు కాల్పులకు పాల్పడి ఇద్దరి ప్రాణాలను బలికొన్న ఘటన జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు పండా అలంకార్ బంగారు ఆభరణాల దుకాణం సిబ్బంది కాగా, మరొక వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా గుర్తించారు. ఈ ఘటన పాణికొయిలీ ప్రాంతం ప్రధాన కూడలిలో శనివారం సంభవించింది. మృతి చెందిన బంగారు దుకాణం సిబ్బంది పొట్ట మరియు నడుంపై గాయాలైనట్లు గుర్తించారు. మరో మృతుడు నీలమాధవ్ పండా కాగా, అతడు విద్యుత్ విభాగం సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే.. పండా అలంకార్ అనే బంగారు ఆభరణాల దుకాణం నుంచి నగదు జమ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బయల్దేరారు. వీరి కదలికని పసిగట్టిన ముగ్గురు దుండగులు బైక్ మీద వీరిని వెంబడించారు. ఇంతలో విద్యుత్ విభాగం కార్యాలయం సమీపంలో నిలిచి ఉన్న కారుని దుండగుల బైక్ ఢీకొంది. ఈ ప్రాంగణంలో ఉన్న వ్యక్తి బెంబేలెత్తి కేకలు వేయడంతో ఆయనపై దుండగులు తుపాకీ గురిపెట్టి కాల్చారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. సత్వర చికిత్స కోసం తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం దుండగులు ముందుకు దూసుకుపోయి బంగారు ఆభరణాల దుకాణం సిబ్బందిపై గురి పెట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుకాణం సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పారిపోతున్న 3 మంది దుండగుల్లో ఇద్దరిని స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో దుండగులు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment