అధికారులు సమష్టిగా పని చేయాలి
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ
భువనేశ్వర్: కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ప్రభుత్వ ఽఅధికారులంతా సమష్టి బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పిలుపునిచ్చారు. ఆంగ్ల సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని సీనియర్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్థానిక లోక్ సేవా భవనంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అయితే భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి, అకాల వర్షాలతో పంటలు నష్టం బారిన పడి రైతాంగం వాపోతున్న విచారకర పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి నూతన సంవత్సర వేడుకలను నివారించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు వాస్తవ కార్యాచరణకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇదే దృక్పథంతో ప్రభుత్వ కార్యాచరణ నిరవధికంగా కొనసాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం చాలా వరకు నెరవేర్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారుల సహకారంతో జాతీయ స్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఈ కార్యాచరణతో ఇతర రాష్ట్రాల కంటే ఒడిశా చాలా మెరుగ్గా రాణిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది సత్ఫలితాలు సాధించాలన్నారు. సవాళ్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉందన్నారు. సమష్టి బాధ్యతతో అన్ని సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా లక్ష్యం సాధించాలన్నారు. ఇటీవల ముగిసిన నేవీ డే, డీజీపీ కాన్ఫరెన్స్ తదితర జాతీయ స్థాయి కార్యక్రమాలు విజయవంతం కావడం ప్రేరణగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదే తరహాలో ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టతను బలపరిచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్‌దేవ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఒడిశాకు ప్రగతి సంవత్సరంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది 2036, స్వతంత్ర బారత్ శతాబ్ది 2047 రెండు అంచెల వికాస కార్యాచరణలన్నారు. ఈ దిశలో సంకల్ప సాధన కోసం ముఖ్యమంత్రి మార్గదర్శకంలో అంతా సమష్టిగా పనిచేయాలని అధికారుల్ని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో అధికారులు సమర్థవంతంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రకటించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగులంతా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment