గవర్నర్‌కు ఏసీఏ అభినందనలు
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ హరిబాబు కంభంపాటితో స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి (ఏసీఏ) ప్రతినిధి బృందం భేటీ అయింది. కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సమితి సలహాదారుడు గన్నవరపు ఆనంద రావు ఆధ్వర్యంలో 4 మంది సభ్యుల ప్రతినిధి బృందం గవర్నరుతో సంభాషించింది. ఈ సందర్భంగా సమితి ఆవిర్భావం, కార్యకలాపాలు వగైరా అంశాల్ని సంక్షిప్తంగా వివరించింది. సమితి కార్యకలాపాల్లో పాలుపంచుకుని సహాయ సహకారాలు అందజేయాలని అభ్యర్థించినట్లు ఆనంద రావు తెలిపారు.
బడ్జెట్ రూపకల్పనకు
ప్రతిపాదనలు ఆహ్వానం
భువనేశ్వర్: కొత్త ఆర్థిక సంవత్సరం 2025–26 బడ్జెట్ రూపకల్పన కోసం కసరత్తు ఆరంభమైంది. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు ఇతరేతర వర్గాల అభిప్రాయాలను ఆర్థిక శాఖ కోరింది. ఈ నెల 31 వరకు అభిప్రాయాలు, సలహాలు, సూచనల దాఖలుకు గడువు కల్పించింది. 3 విభాగాలలో గరిష్టంగా 500 పదాలలో అభిప్రాయాల్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. అభిప్రాయాలను వాట్సాప్ నంబరు – 9438161111 కు అభిప్రాయాలు దాఖలు చేసేందుకు వీలవుతుంది. వీటితో రాష్ట్ర ఆర్థిక శాఖ ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగాం, ఎక్స్ ఖాతాల ఆధ్వర్యంలో కూడా బడ్జెటు ప్రతిపాదనల్ని ప్రజలు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి జనజాతి మేళాకు ఐదు బృందాలు
జయపురం: భవనేశ్వర్‌లో ఈ నెల నాలుగు నుంచి 16వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జన జాతీయ గౌరవమేళాలో పాల్గొనేందుకు జయపురం నుంచి ఐదు స్వయం సహాయక గ్రూపులు గురువారం సాయంత్రం బయలుదేరి వెళ్లాయి. జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా జయపురం సబ్‌డివిజన్‌లో జయపురం, బొరిగుమ్మ, కొట్‌పాడ్, కుంద్ర, బొయిపరిగుడ, సమితిల నుంచి ఐదు సంఘాల నుంచి పది మంది మహిళలను మేళాకు అధికారులు ఎంపిక చేశారు. జయపురం సబ్‌కలక్టర్, ఐటీడీఏ అడ్మినిస్ట్రేట్ అధికారిణి అక్కవరమ్ శొశ్య రెడ్డి బృందాలు వెళ్లే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కొరాపుట్ జిల్లాలో స్వయం సహాయక గ్రూపుల మహిళలు తయారు చేస్తున్న వస్తువులు ముఖ్యంగా అటవీ ఉత్పత్తులతో తయారు చేసే గుగ్గిలం, తేనె, వేప నూనె, ఉసిరి, అగరబత్తి, వ్యవసాయ ఉత్పత్తులు చోళ్లు, పసుపు, ఆవాలు, ఒలుసులు, చిరుధాన్యాలతో తయారు చేసే వస్తువులు ప్రదర్శిస్తారు. జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ మేనేజర్ దేవాసిస్ పట్నాయక్, జూనియర్ ఇంజినీర్ చైతన్య బస్కె పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలి
రాయగడ: వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని యువ భారత్ కృషక్ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లాలోని బిసంకటక్‌లో యువ భారత్ కృషక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిర్వహించిన ర్యాలీలో సంఘం అధ్యక్షులు బాలముకుంద పాయక్ నేతృత్వంలో వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి పేరిట తహసీల్దార్ కె.వేంకటేశ్వర్‌కు సమర్పించారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు ఎంతోమంది నష్టపొయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. బిసంకటక్‌లోని మా మార్కమా మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో సంఘం ఉపాధ్యక్షులు సత్యనారాయణ పటిక, కార్యదర్శి జవాబ్ పలక, కోశాధికారి రామదాస్ ఉలక, అధికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment