ప్రాణం తీసిన వేడుకలు..?
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితిలో నూతన సంవత్సరం సందర్భంగా జరుపుకున్న వేడుకలు ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన యువకుడు బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసుస్టేషన్ పరిధి నకులగుడ గ్రామానికి చెందిన జగన్నాథ మఝి(30)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే బొరిగుమ్మ సబ్ డివిజన్ పోలీసు అధికారి తపస్వినీ కుహర్ క్లూస్ టీమ్‌తో ఘటన ప్రాంతానికి వెళ్లారు. పోలీసుస్టేషన్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసులు వివరణ మేరకు..
పోలీసుల వివరణ ప్రకారం జగన్నాథ్ మాఝి తన స్నేహితులతో కలిసి నకులపుట్ గ్రామ సమీపంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలకు వెళ్లాడు. అనంతరం ఇంటికి బయల్దేరాడు. అతను వస్తుండగా ఆ గ్రామ సమీపంలోని మరో ప్రాంతంలో మరి కొంతమంది సాయంత్రం వేడుకలు చేసుకుంటున్నారు. జగన్నాథ్ అక్కడికి వెళ్లగా అక్కడ కొంతమందితో గొడవ జరిగింది. కాగా ఆరాత్రి అతను ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెదికారు. అయితే గురువారం అతడి ఇంటి వెనుక ఉన్న కాయగూరల పొలం వద్ద రక్తపు మడుగులో జగన్నాథ్ పడి ఉండడం కనిపించింది. అయితే అప్పటికే అతడు మరణించాడు. ఈ విషయంపై జగన్నాథ్ తమ్ముడు దైతేరీ మఝి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రథమంగా జగన్నాథ్‌తో కలిసి ఉదయం వేడుకలు చేసుకున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. తర్వాత సాయంత్రం వేడుకలు జరుపుకున్న వారిలో నలుగురుని స్టేషన్‌కు రప్పించి వారిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment