కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

Published Sat, Jan 4 2025 8:14 AM | Last Updated on Sat, Jan 4 2025 4:22 PM

ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రితో  కొత్త గవర్నర్‌

ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రితో కొత్త గవర్నర్‌

భువనేశ్వర్‌: రాష్ట్ర కొత్త గవర్నర్‌గా డాక్టర్‌ హరిబాబు కంభంపాటి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్రానికి 27వ గవర్నర్‌. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు హరిబాబు కంభంపాటితో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చక్రధారి శరణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. స్థానిక రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఇరువురు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రభాతి పరిడా, ప్రతిపక్ష నేత నవీన్‌ పట్నాయక్‌, శాసన సభ స్పీకర్‌ సురమా పాఢి, ఇతర మంత్రి మండలి సభ్యులు, వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కొత్త గవర్నర్‌కు గార్డ్‌ ఆఫ్‌ ఆనరు ప్రదానం చేశారు.

భారత రాష్ట్రపతి ఆమోదం మేరకు రాష్ట్ర గవర్నర్‌గా హరిబాబు కంభంపాటి గత నెల 24న నియమితులయ్యారు. గురువారం రాష్ట్రానికి చేరిన కొత్త గవర్నర్‌ పూరీ వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. పూరీ రాజ్‌ భవన్‌లో రాత్రి బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం భువనేశ్వర్‌కు తిరిగి వచ్చారు. అనంతరం రాజ్‌ భవనన్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఒడిశా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు కొత్త గవర్నర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్‌ ఆహుజా, రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వైబీ ఖురానియా, కటక్‌, భువనేశ్వర్‌ జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌, పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలో 1953లో జన్మించిన కంభంపాటి హరిబాబు భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం సాధించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించారు. విశ్వ విద్యాలయం విద్యార్థి రోజుల్లోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1970 దశకంలో ఎమర్జెన్సీ కాలంలో 6 నెలల పాటు కారాగార శిక్ష రాజకీయ కార్యాచరణ పట్ల ఆయనకున్న దృఢ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

కంభంపాటి ఉన్నత విద్యావేత్త. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా 24 సంవత్సరాలు విశేష సేవలు అందించారు. ఈ దశలో ఇంజనీరింగ్‌ విద్యార్థుల విద్యా అభివద్ధికి గణనీయంగా తోడ్పడి వారి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించారు. 

1977లో జనతా దళ్‌లో చేరడంతో కంభంపాటి ప్రత్యక్ష రాజకీయ పయనం ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంతో రాజకీయంగా ఆయన ప్రాధాన్యత ఊపందుకుంది. 1993 నుండి దశాబ్దం పాటు ఈ హోదాలో కొనసాగారు. 1999లో విశాఖపట్నం–1 నియోజకవర్గం నుంచి అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఆయనకు 2005లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2014 – 2018 మధ్య ఆంధ్ర ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014 నుండి 2019 వరకు పార్లమెంటు సభ్యునిగా, కంభంపాటి వివిధ పార్లమెంటరీ కమిటీలకు గణనీయమైన సహకారం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాజ్ భవన్ ప్రాంగణంలో గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్ హరిబాబు కంభంపాటి1
1/6

రాజ్ భవన్ ప్రాంగణంలో గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్ హరిబాబు కంభంపాటి

గవర్నర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన అతిథులు2
2/6

గవర్నర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన అతిథులు

కొత్త గవర్నర్‌ కు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అభినందనలు3
3/6

కొత్త గవర్నర్‌ కు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అభినందనలు

విపక్ష నేత నవీన్ పట్నాయక్ తో గవర్నర్‌ సంభాషణ4
4/6

విపక్ష నేత నవీన్ పట్నాయక్ తో గవర్నర్‌ సంభాషణ

బాధ్యతలు స్వీకరించిన కొత్త గవర్నర్‌ హరిబాబు5
5/6

బాధ్యతలు స్వీకరించిన కొత్త గవర్నర్‌ హరిబాబు

రాష్ట్ర 27వ గవర్నర్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ హరిబాబు కంభంపాటి6
6/6

రాష్ట్ర 27వ గవర్నర్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ హరిబాబు కంభంపాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement