రాయితీపై సౌర విద్యుత్ యూనిట్లు
విజయనగరం అర్బన్: కేంద్రప్రభుత్వం ప్రకటించిన పీఎం.సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత గహాల్లో రాయితీపై సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ వెల్ల డించారు. ఈ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలోగా జిల్లాలోని 51వేల ఎస్సీ, ఎస్టీ గృహాల్లో సౌరవిద్యుత్ కనెక్షన్లు ఏర్పాటుచేసే దిశగా డీఆర్‌డీఏ, మెప్మా, మునిసిపల్, విద్యుత్ పంపిణీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయా వర్గాలకు చెందిన కుటుంబాల్లో సౌరవిద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, వారికి ఆదా అయ్యే విద్యుత్ చార్జీల మొత్తం తెలియజేసి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాస్థాయి పీఎం.సూర్యఘర్ కమిటీ సమావేశం కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.20,000 విద్యుత్ చార్జీల బిల్లును ఆదా చేసుకోవచ్చన్నారు. రెండు కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్ ఏర్పాటుపై పీఎం.సూర్యఘర్ పథకం ద్వారా రూ.60 వేల రాయితీ లభిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మండల, పట్టణ సమాఖ్యల ద్వారా అవసరమైన మేరకు రుణాలు మంజూరు చేయాలని మెప్మా, డీఆర్‌డీఏ, మునిసిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఆదర్శ గ్రామం ఎంపిక
విజయనగరం రూరల్ పరిధిలో జొన్నవలస, పూసపాటిరేగ పరిధిలో రెల్లివలస, కొత్తవలస పరిధిలో దేశపాత్రునిపాలెం, రాజాం మండలంలో బొద్దాం, గజపతినగరంలో పురిటిపెంట, బొబ్బిలిలో పిరిడి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేశామని ఆ గ్రామాల్లో శతశాతం గృహాల సౌర విద్యుద్దీకరణ చేసిన గ్రామాన్ని ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌ఈ లక్ష్మణరావు, బొబ్బిలి, రాజాం మునిసిపల్ కమిషనర్‌లు, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment