ధాన్యం బస్తాలు దగ్ధం
● విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
● లబోదిబోమంటున్న రైతు
తెర్లాం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 35 బస్తాల ధాన్యం దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి బాధిత రైతు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం తెర్లాం గ్రామానికి చెందిన రైతు బూరి సత్యం తాను పండించిన వరిచేను బుధవారం సాయంత్రం తోటపల్లి ప్రధాన కుడికాలువ గట్టుపై నూర్పు చేశాడు. వరిచేను నూర్చిన ప్రదేశంలోనే ధాన్యాన్ని 35 గోనె సంచుల్లో నింపి వరిగడ్డి కప్పి నిల్వ చేశాడు. గురువారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి అగ్ని ప్రమాదం జరిగింది. ధాన్యం బస్తాలు విద్యుత్ వైర్ల కింద నిల్వ చేయడంతో విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో అగ్గిరవ్వలు వరిగడ్డిపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. ఆరుగాలం కష్టపడి, మదుపులు పెట్టి పండించిన ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయని రైతు సత్యం, అతని భార్య లబోదిబోమంటూ విలపించారు. అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే వచ్చి మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదవార్త తెలిసిన వెంటనే వీఆర్‌వో డి.రాము సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరు, నష్టపోయిన ధాన్యం వివరాలను తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్‌కు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment