బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థుల ప్రగతికి బాలోత్సవం దోహదపడుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలోత్సవం–2024 బ్రోచర్‌ను ఆదివారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ వేర్వేరుగా ఆవిష్కరించారు. డిసెంబర్ 13, 14వ తేదీలలో పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాలలో ఈ వేడుక నిర్వహించనున్నట్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, కట్టా కోటేశ్వరరావు తెలిపారు, జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 65 విభాగాలలో పోటీ పడతారని వివరించారు. గత ఏడాది 175 పాఠశాలల నుంచి 8 వేల మంది హాజరయ్యారని, ఈ సారి 10 వేల మంది వస్తారని భావించి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ కె.వేణుగోపాలరావు, కమిటీ గౌరవాధ్యక్షుడు ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌సీ ఉచిత శిక్షణకు
దరఖాస్తుల స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: డీఎస్‌సీ పరీక్షకు హాజరయ్యే ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఎస్‌సీ వెల్ఫేర్ సాధికారిత అధికారి ఎస్.ఓబుల్‌నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఎస్‌జీటీలకు ఇంటర్మీడియట్‌తోపాటు డైట్‌సెట్, టెట్, స్కూల్ అసిస్టెంట్స్‌కు డిగ్రీతోపాటు బీఈడీ, టెట్ విద్యార్హతలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఘనంగా విజిలెన్స్
వారోత్సవాలు
మాచర్ల: కొత్తపల్లి గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాగార్జునసాగర్ 400 కేవీ సబ్‌స్టేషన్ చీఫ్ మేనేజర్ జెల్ల రాము ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఓరుగంటి చిన్నారెడ్డి మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు విజిలెన్స్‌పై అవగాహన నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. పవర్ గ్రిడ్ మేనేజర్ సుబోధ్కంత్ మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం, అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చీఫ్ మేనేజర్ రాము మాట్లాడుతూ.. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటి ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ–2024 నినాదంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌జీవో సభ్యులు బంగారయ్య, పవర్ గ్రిడ్ సిబ్బంది పాల్గొన్నారు.
గోవుల అక్రమ
రవాణాకు అడ్డుకట్ట
మంగళగిరి: అక్రమంగా రవాణా చేస్తున్న గోవులను పోలీసులు కాపాడారు. జీవాలను గోశాలకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఆదివారం తెల్లవారుజామున గోవులు తరలిస్తున్న లారీని విధులలో ఉన్న హోంగార్డు అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆత్మకూరు వంతెన వద్ద గోవులను తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సురక్షితంగా నరసింహస్వామి గోశాలకు తరలించారు. అక్కడి నిర్వాహకులకు అప్పగించారు. గోవుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. ఎవరైనా ఇలా గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment