సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీకి పల్నాడు వాసి ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీకి పల్నాడు జిల్లావాసి ఎంపికై నట్లు పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఆదివారం సత్తెనపల్లిలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్‌డీటీ క్రీడామైదానంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ మెన్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు గోల్‌కీపర్‌గా షేక్ ఇర్ఫాన్ ఎంపికయ్యాడన్నారు. ఇర్ఫాన్‌ను పలువురు అభినందించారు. ఆయనతో పాటు సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ షేక్ మహ్మద్ రియాజ్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఉన్నారు.
సీపీఎం కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
అమరావతి: మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామంలో సీపీఎం కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎండ్రాయి గ్రామంలో సీపీఎం కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వృద్ధుడైన నండూరి వెంకటేశ్వరరాజుపై పాత కక్షల నేపధ్యంలో ఎండ్రాయి మెయిన్ రోడ్డుపై టీడీపీ వర్గీయులు గోరంట్ల నాని, గోరంట్ల నాగమల్లేశ్వరరావు రత్నాకర్ ప్రసాద్‌లు దాడిచేశారు. ఈ సంఘటనపై సీపీఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ వయస్సు రీత్యా గౌరవం ఇవ్వకపోగా అకారణంగా అసభ్యపదజాలంతో తిడుతూ రోడ్డు మీద పడేసి కొట్టటం దారుణమన్నారు. అధికారం ఉంది మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. నిన్నుచంపేస్తామని బాధితుడిని బెదిరించారన్నారు.ఈ సంఘటన పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని నిందితులను అరెస్టు చేయాలన్నారు. బాధితుడు వెంకటేశ్వరరాజు స్థానిక 30 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment