వరదలకు పాడైన మోటార్లకు నష్టపరిహారం ఇవ్వాలి
తాడేపల్లి రూరల్: ఆగస్టులో వరదల ముంపునకు గురై పాడైన ఇంజిన్ ఆయిల్ మోటార్లు, మోటార్ పంపు సెట్లను నమోదు చేసి రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరులో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. పలువురు కౌలు రైతులను కలిసి వరదముంపుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరిబాబు మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపులో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొందరికే మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని విమర్శించారు. తక్షణమే రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, రైతు సంఘం నాయకులు బొప్పన గోపాలరావు, మేడూరి పాములు, వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు పరిమిశెట్టి శివనాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు పల్లపాటి సుబ్బారావు, పోకల శంకర్, ధనేకుల వేణు, నారంశెట్టి శివశంకరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment