లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): ఆర్థిక లావాదేవిల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాడీపేట ప్రాంతానికి చెందిన గాడిపర్తి మాధవరావు పట్టాభిపురంలోని టెంపుల్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటాడు. శనివారం రాత్రి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది పులుసు రామకృష్ణారెడ్డితో కలిసి రామకృష్ణ అనే మరో స్నేహితుడి వద్దకు ఇద్దరు వెళ్లారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే సుబ్రమణ్యం అనే అతను వచ్చి రామకృష్ణారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. నాపై కోర్టులో దావా వేస్తావా అంత మాగడివా అంటూ రామకృష్ణారెడ్డిని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి, ఈ రోజు ఎలాగైనా చంపేస్తానని తన బాకీ కూడా పూర్తిగా రద్దు అవుతుందని చెప్పి గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా తన కుమారుడు రిషి రవిచంద్రకు ఫోన్ చేసి రామకృష్ణారెడ్డి దొరికాడని చెప్పి పట్టాభిపురం రావాలని చెప్పాడు. రవిచంద్ర సుమారు 15 మందిని తీసుకుని అక్కడికి చేరుకుని రామకృష్ణారెడ్డిపై దాడికి యత్నించాడు. రవిచంద్ర వెంట వచ్చిన వారు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాధవరావు తమ్ముడు రాము ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఘర్షణకు వచ్చిన వారు పరారయ్యారు. దీంతో మాధవరావు, రామకృష్ణారెడ్డి కారులో పోలీస్‌స్టేషన్‌కు బయలు దేరగా, వీరితోపాటు ద్విచక్రవాహనంపై వస్తున్న రామును సుబ్రమణ్యం కుమారుడు రిషి రవిచంద్ర, స్నేహితులతో కలిసి కారుతో ఢీ కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. రాముకు వాహనంపై నుంచి కిందపడి చిన్నపాటి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో రిషి రవిచంద్ర తన గ్యాంగ్‌తో పరారయ్యారు. మాధవరావు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ ముందు వాగ్వివాదం
మాచర్ల ఎమ్మెల్యే బావమరిది రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడిన సుబ్రమణ్యం తరఫున పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్దకు ఆదివారం రాత్రి టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చేరుకున్నాడు. పోలీస్‌స్టేషన్ బయట మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దుర్భషలాడాడు. రామకృష్ణారెడ్డితో వచ్చిన వారికి ఎమ్మెల్యే అనుచరుడి మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీన్ని గమనించిన పట్టాభిపురం పోలీసులు స్టేషన్ బయట వాగ్వివాదం జరుగుతుందని తెలుసుకుని బయటకు వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పారు. దీంతో పశ్చిమ ఎమ్మెల్యే అనుచరుడు స్టేషన్ వద్ద నుంచి వెళ్లిపోయాడు.
కారుతో ఢీకొట్టి హతమార్చేయత్నం చేసిన వైనం ఆర్థిక లావాదేవిల వల్లే వివాదం రెండు వర్గాలు ఒక పార్టీకి చెందిన వారే కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment