దేశాన్ని కార్పొరేట్‌మయం చేస్తున్న కేంద్రం
సత్తెనపల్లి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల జీవోలను తీసుకువచ్చి దేశం మొత్తాన్ని కార్పొరేట్ మయం చేస్తున్నదని, ఈ విధానాలు రానున్న కాలంలో ప్రజలకు మరింత భారంగా పరిణమించి ప్రజల జీవన పరిస్థితులు అధ్వానమవుతాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం సత్తెనపల్లి పట్టణ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభకు పట్టణ కమిటీ సభ్యుడు కట్టా శివ దుర్గారావు, గద్దె ఉమాశ్రీలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముందుగా మహాసభ ప్రాంగణం ముందు సీపీఎం సీనియర్ నాయకులు గుంటూరు వేమయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాసభ ప్రాంగణంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజా సంఘాలను నిర్మాణం చేసి ప్రజా సమస్యలపై పనిచేసే పార్టీని ప్రజలు నిర్మించాలని ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు సీపీఎం నిర్విరామంగా కృషి చేసిందన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదం తీవ్రస్థాయికి వెళ్లిందన్నారు. ప్రతిచోట ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం ప్రతి పండుగలో ఉత్సవాలలోను చొరబడి మతోన్మాదాన్ని ప్రజలలో చొప్పస్తున్నారన్నారు. ఇటువంటి విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత సీపీఎం కార్యకర్తలపై ఉందన్నారు. ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన కార్యకలాపాల కార్యదర్శి నివేదికను ధరణికోట విమల మహాసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహాసభలో ప్రతినిధులు కార్యదర్శి నివేదికపై సమీక్ష చేశారు. అనంతరం కార్యదర్శి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనంతరం మహాసభ 13 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా ఎన్నికై న కమిటీ సభ్యులు ధరణికోట విమల, ఎం.హరిపోతురాజు, కట్ట శివదుర్గారావు, అనుముల వీరబ్రహ్మం, జడ రాజకుమార్, పంతంగి ప్రభాకర్, పి.శేషు మణికంఠ, కె.లోక్ నాయక్, మునగా జ్యోతి, షేక్ మస్తాన్ వలి, పులిపాటి రామారావు, షేక్ సైదులు, మండూరి కార్తీక్ లు సమావేశమై సత్తెనపల్లి పట్టణ నూతన కార్యదర్శిగా ధరణికోట విమలను తిరిగి ఎన్నుకున్నారు. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్యలు మాట్లాడారు. మహాసభలో పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు, న్యాయవాది పి.పాములయ్య, సీపీఎం నాయకులు పొట్టి సూర్యప్రకాశరావు, అవ్వారు ప్రసాదరావు, ఇంజం లింగయ్య, పెండ్యాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు భారం కానున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పోరాటాలకు ప్రజలంతా సిద్ధం కావాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య
Comments
Please login to add a commentAdd a comment