అపార్ నమోదులో సమస్యలను పరిష్కరించాలి
డీఈవో రేణుకకు అప్సా విజ్ఞప్తి
గుంటూరు ఎడ్యుకేషన్: అపార్ నమోదులో సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (అప్సా) రాష్ట్ర కో–కన్వీనర్ మేకల రవీంద్రబాబు, కోశాధికారి చెరుకూరి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను అప్సా ప్రతినిధులు కలిశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అప్సా ప్రతినిధులు మాట్లాడుతూ.. అపార్ కోసం విద్యార్థుల వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. యూడైజ్ ప్లస్, ఆధార్‌లోని వివరాలు సరిపోలకపోవడంతో నమోదు కావడం లేదని పేర్కొన్నారు. ఆధార్‌లో తప్పుల సవరణకు విద్యార్థులు ఆయా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని డీఈవోకు వివరించారు. అపార్ అప్‌లోడింగ్‌కు గడువు పెంచాలని కోరారు. పదో తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఆదివారాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈవో రేణుక స్పందిస్తూ.. ఆధార్ సవరణల కోసం గుంటూరు నగరంలో అదనపు కేంద్రాల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డీఈవోను కలిసిన వారిలో అప్సా రాష్ట్ర నాయకులు వంగా శ్రీనివాసరావు, ఏవీ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు మురళీమోహనరావు, డివిజన్ అధ్యక్షులు నర్రా రాజేష్, భాను ప్రసాద్, నాయకులు మాదా శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, శివనాగేశ్వరరావు, పాశం శ్రీనివాసరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment