సబ్‌జైలు సందర్శన
సత్తెనపల్లి: సత్తెనపల్లి సబ్ జైలును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి, గుంటూరు జిల్లా కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) లీలావతి శనివారం సందర్శించారు. సబ్ జైలులోని నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. సరుకుల నాణ్యతను, ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మహమ్మద్ గౌస్, ప్యానల్ న్యాయవాది బి.ఎల్ కోటేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, సబ్‌జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’
నరసరావుపేట రూరల్: పెద్దచెరువులోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యాలయం ప్రాంగణంలోని డివిజన్ కార్యాలయం, ఏరియా పశువైద్యశాల, పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంగణాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.కాంతారావు, డీడీఏ డాక్టర్ సి.కోటిరత్నం, ఏడీఏ డాక్టర్ కె.కళావతి, ఏరియా పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
స్కేటర్ జెస్సీరాజ్‌కు
బాల పురస్కార్
మంగళగిరి: పట్టణానికి చెందిన అంతర్జాతీయ స్కేటర్ జెస్సీరాజ్‌ను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ –2025 వరించింది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డు అందుకోనున్నారు. ఏటా 25 మంది బాలలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఇస్తుంటుంది. వచ్చే ఏడాది జాబితాను ఇటీవల ప్రకటించింది. ఈ సందర్భంగా జెస్సీరాజ్‌ను పలువురు అభినందించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 1616 క్యూసెక్కుల విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 68, తూర్పు కెనాల్‌కు 63, పశ్చిమ కెనాల్‌కు 56, నిజాంపట్నం కాలువకు 151, కొమ్మమూరు కాలువకు 1310 క్యూసెక్కులు విడుదల చేశారు.
వస్తువుల కొనుగోళ్లపై అవగాహన
నరసరావుపేట: వస్తువుల కొనుగోళ్లలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే దీనిపై అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశాల మేరకు విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. జేసీ గనోరే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లీగల్ మెట్రాలజి శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ అల్లురయ్య మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డెమో రూపంలో చూపించారు. జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పిల్లి యఘ్ననారాయణ, డీసీపీసీ మెంబర్ కె.మస్తాన్‌రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి బి.నారదముని వివిధ వస్తువుల కొనుగోలు గురించి వివరించారు. కలెక్టర్ చేతుల మీదుగా విజేతలకు మొదటి బహుమతి రూ.3వేలు, ద్వితీయ బహుమతి రూ.2వేలు, తృతీయ బహుమతి రూ.1500లతో పాటు ప్రసంశా పత్రాలు, మెమెంటోలను అందజేశారు. డీఈఓ చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment