వ్యసనాలతో జీవితాన్ని బలి చేసుకోవద్దు
ఏఎన్‌యూ: వ్యసనాలకు లోనై జీవితాలు బలి చేసుకోవద్దని విద్యార్థులకు డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం నిర్వహించిన ఇండక్షన్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ.. నేడు యువతను పట్టిపీడిస్తున్న సైబర్ క్రైమ్, డ్రగ్స్ ముప్పు వంటి సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలిసీ తెలియని వయసులో విద్యార్థులు, యువత చెడు వ్యసనాల వైపు పయనిస్తూ ఉండటం బాధాకరమన్నారు. తమతోపాటు సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు ప్రసంగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలన్నారు. నేడు సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దానిలో ఉన్న అపార ఉపాధి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగంతోనే సరిపెట్టుకోకుండా సమాజ స్థితిగతులు మార్చే వారిగా విద్యార్థులు ఎదగాలన్నారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ లేదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన స్కిల్ ఓరియెంటెడ్ కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ తరగతులను, ఉద్యోగాలు పొందేందుకు క్యాంపస్ డ్రైవ్‌లను నిరంతరం చేపట్టనున్నామని తెలిపారు. రెక్టార్ ఆచార్య కే రత్న షీలామణి మాట్లాడుతూ సమాజాభివృద్ధి, దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులకు సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.సిద్ధయ్య, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎం.గోపికృష్ణ, డాక్టర్ డి.చంద్రమౌళి ప్రసంగించారు. పలువురు పరిశోధకులు పాల్గొన్నారు.
డీజీపీ ద్వారకా తిరుమలరావు
Comments
Please login to add a commentAdd a comment