బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు అనుమతి లేదు
నరసరావుపేట: జిల్లాలో ఈనెల 31వ తేదీన పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నందున నూతన సంవత్సర వేడుకలకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై ఎటువంటి అనుమతిలేదని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాకు నిబంధనలను వివరించారు. జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు పోలీసు నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించుకోవాలని అన్నారు. పోలీసు నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టనున్నందున ఆత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్‌లు, ప్రదేశాలలో పికెట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 31 రాత్రి యువకులు మద్యం తాగి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కొంత మంది మద్యం మత్తులో గ్రూప్‌లుగా ఏర్పడి ఘర్షణలకు దిగి శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నిర్ణీత సమయంలో మూసివేయాలని కోరారు. బైక్ రేసులు, రాష్ డ్రైవింగ్, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ తీసివేసి అధిక శబ్దాలతో వాహనాలు నడపడంవలన ప్రజాజీవనానికి భంగంకలిగే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించామన్నారు. వీటిని అతిక్రమిస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకోవాలనీ, తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ సిస్టంలు ఉపయోగించేందుకు తప్పనిసరిగా సంబధిత పోలీస్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు. న్యూస్ పేపర్లు, మాగజైన్‌న్స్, హోర్డింగ్స్‌లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు, ప్రకటనలు చేయరాదు అన్నారు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, అశ్లీల సంజ్ఞలు అనుమతించబడవని పేర్కొన్నారు. అందువలన నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
పోలీసు నిబంధనలు పాటించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఆ రోజున పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తాం లౌడు స్పీకర్లు, మ్యూజిక్స్ సిస్టమ్‌లకు ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment