రేంజ్‌లో 63 మంది సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: గుంటూరు రేంజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు జాబితాను సిద్ధం చేశారు. వారం రోజుల కిందట ఈ జాబితాను సిద్ధం చేయగా, 63 మంది సీఐలు ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐలు కె.వేమారెడ్డి, బెల్లం శ్రీనివాసరావు, ఎస్‌వి.రాజశేఖర్‌రెడ్డి, ఎస్.శ్రీనివాసులరెడ్డి, డివి.చౌదరి, ఎన్.శ్రీకాంత్‌బాబు, ఎస్.అంటోనిరాజు, ఎం.లక్ష్మణ్, బత్తుల శ్రీనివాసరావు, ఐ.శ్రీనివా సన్, బి.రమేష్‌బాబు, ఎ.అశోక్‌కుమార్, కొంకా శ్రీనివాసరావు, ఏవీ.రమణ, ఎం.హైమారావు, షేక్. కరిముల్లాషావలి, యూవీ.శోభన్‌బాబుతోపాటు పలువురు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతిలో ఉన్నారు.
జిల్లాలో 95.32శాతం
పింఛన్ల పంపిణీ
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మంగళవారం జరిగింది. సాయంత్రం 6.25గంటలకు 95.32శాతం పంపిణీ పూర్తిచేశారు. జనవరి ఒకటో తేదీన సెలవు దినం కావటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే జిల్లా వ్యాప్తంగా పంపిణీని అధికారులు ప్రారంభించారు. జనవరి నెల లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ ప్రారంభానికి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసరావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పర్యటించి రెండు కుటుంబాల వారికి స్వయంగా పింఛన్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 2,73,530 మందికి రూ.117,74,14,500 అందజేయాల్సి ఉండగా వారిలో 2,60,995 మందికి రూ.112,03,04,000 పంపిణీ చేశారు. ప్రతిచోటా స్థానిక టీడీపీ నాయకులు పంపిణీలో భాగస్వాములయ్యారు. ఎక్కువ భాగం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందజేశారు.
కొనసాగుతున్న
ధనుర్మాస ఉత్సవాలు
మంగళగిరి: నగర పరిధిలోని ఆత్మకూరు బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చిన్న జీయర్ స్వామిజీ భక్తులకు ప్రవచానలు అందజేస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిజీ ప్రజలందరూ ఈ సంవత్సరంలో ఆనందోత్సవాలతో జీవించాలని కోరారు.
మెరిట్ జాబితాపై
అభ్యంతరాలకు అవకాశం
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక , సవరించిన మెరిట్ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువపత్రాలతో జనవరి 1 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వైద్య కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మెరిట్ జాబితా కోసం గుంటూరు.ఏపీ.జీవోవీ.ఇన్, గుంటూరు మెడికల్ కాలేజీ.ఈడీయూ.ఇన్ వెబ్‌సైట్‌లలో చూడాలని సూచించారు.
యార్డుకు 58,387
బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 58,387 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 53,319 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 7,500 నుంచి రూ. 14,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,000 నుంచి రూ. 16,300 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 51,513 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment