కేక్ కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి...
నకరికల్లు: నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. లారీ మృత్యువురూపంలో వచ్చి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని త్రిపురాపురం గ్రామం సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... త్రిపురాపురం గ్రామానికి చెందిన గడిబోయిన దుర్గారావు తన ద్విచక్రవాహనంపై గంజనబోయిన కార్తీక్ (11)ను ఎక్కించుకొని నకరికల్లుకు కేక్ కోసం బయలుదేరారు. గ్రామం నుంచి అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపైకి చేరుకొని కొద్దిదూరం వెళ్లేలోగానే బైక్ కన్నా ముందుగా వెళ్తున్న ఆటో షడన్ బ్రేక్ వేయడంతో ఆటోను బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న లారీ కార్తీక్ (11)పై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న దుర్గారావుకు తీవ్రగాయాలు కాగా నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.
ఒక్కగానొక్కడు..
త్రిపురాపురం గ్రామానికి చెందిన వెంకటేష్, నాగమణి దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కార్తీక్(11)పెద్దవాడు. నకరికల్లులోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నూతన సంవత్సరం కావడంతో కేక్ తీసుకొని వచ్చాక పాఠశాలకు వెళ్తానని ఇంటి పక్కన వ్యక్తి బైక్‌పై బయలుదేరిన కొద్దిసేపటికే మృత్యు కబళించింది. తమ ఒక్కగానొక్క కుమారుడు లేడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ముందు వెళ్తున్న ఆటో షడన్
బ్రేక్ వేయడంతో ప్రమాదం
ఆటోను ఢీకొని రోడ్డుపై పడిన
వారిపై దూసుకెళ్లిన లారీ
ప్రమాదంలో ఒకరు మృతి,
మరొకరికి గాయాలు
కొత్త సంవత్సరం వేళ
కుటుంబంలో విషాదం
మంచుతో అప్రమత్తంగా ఉండండి
చలికాలం కావడంతో మంచు తీవ్రంగా ఉందని వాహనాలు అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ఎస్ చల్లా సురేష్ సూచించారు. వేకువజామున సాధ్యమైనంత మేర ప్రయాణాలు తగ్గించుకోవాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
చల్లా సురేష్, ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment