సాక్షి ప్రతినిధి, విజయనగరం:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతుల వద్దనున్న ధాన్యం తడవకుండా సహాయసహకారాలు అందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులకు మంగళవారం టెలికాన్ఫరెన్సులో దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, రెవె న్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులు పండించిన ధాన్యం సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. వరి కోతలు పూర్తిచేసి ఇప్పటికీ కుప్పలుగా ఉంటే ఈ మూడు రోజులూ నూర్చకుండా రైతుల్లో అవగాహన కలిగించాలని చెప్పారు. పంట కోతలు పూర్తి చేసి పనల మీద ఉంటే వెంటనే కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పి ఉంచేలా సహకారం అందించాలని ఆదేశించారు. ఇందుకోసం 1600 టార్పాలిన్లు పౌర సరఫరాల శాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయని, రైతులు కోరిన వెంటనే వాటిని అందజేస్తామని చెప్పారు. కళ్లాల్లో ఉన్న 30 వేల టన్నుల ధాన్యం తక్షణమే రైస్ మిల్లులకు, లేదంటే గోదాములకు బుధవారం మధ్యాహ్నానికి తరలించాలన్నారు. జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వరి కోతలు చేయొద్దని రైతులకు సూచించాలన్నారు.
ప్రతి గంటకూ పర్యవేక్షణ...
జిల్లాలో రానున్న మూడు రోజులూ ధాన్యం, వరికోతల పరిస్థితులపై ప్రతి గంటకూ సమాచారం సేకరించాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్‌కు కలెక్టరు అంబేడ్కర్ సూచించారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఘటనలకూ ఆస్కారం లేకుండా ఆయా మండలాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
రైతుల వద్దనున్న ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలి
వరి కుప్పలు నూర్పిడిచేయకుండా రైతుల్లో అవగాహన కల్పించండి
అవసరమైన టార్పాలిన్లు, గోనె సంచులు అందించండి
అధికారులకు కలెక్టర్ డాక్టర్ బీఆర్
అంబేడ్కర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment