![జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి ఎం.ఎన్.రాణి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17krp62a-370016_mr-1734463373-0.jpg.webp?itok=LkHPhcVM)
జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి ఎం.ఎన్.రాణి
కొమరాడ: బాల్య వివాహాలు జరిపేవారికి చట్టరీత్యా శిక్ష తప్పదని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి ఎం.ఎన్.రాణి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కొమరాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పీఓ సుగుణకూమారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులకు కిశోరి వికాసంపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ కౌమారదశ బాలికలు 11 నుంచి 18 ఏళ్లు మధ్య వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని, గుడ్ టచ్ బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. పోక్సో చట్టంపై పాఠశాలల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీఓ సత్యనారా యణ, ఎంపీడీఓ మల్లికార్జునరావు, విద్యాశాఖ అధికారి తిరుపతిరావు, అంగన్‌వాడీ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
200 ఎకరాల్లో మల్బరీ సాగు
సీతంపేట: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 200 ఎకరాల్లో మల్బరీ సాగు చేయనున్నట్టు సెరీకల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.వి.సాల్మన్‌రాజ్ అన్నారు. స్థానిక రీలింగ్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టుదారం తీయడాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతుల నుంచి పట్టుగూళ్లు కిలో రూ.500ల నుంచి రూ.600ల మధ్య నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ తయారైన పట్టుదారం కిలో మార్కెట్‌లో రూ.4వేలు పైబడి ధర పలుకుతోందన్నారు. మల్బరీసాగు చేసే రైతులకు షెడ్డుల నిర్మాణానికి 90 శాతం రాయితీపై నిధులు సమకూర్చుతున్నట్టు వెల్ల డించారు. చిన్నషెడ్డుకు రూ.3లక్షల 20వేలు, పెద్దషెడ్డుకు రూ.4లక్షల 50 వేలు చెల్లిస్తున్నామన్నారు. ఆయన వెంట సెరీకల్చర్ ఆఫీసర్ ఊర్మిల ఉన్నారు.
‘భారతీయ విజ్ఞానం’పై గిరిజన వర్సిటీ ఒప్పందం
విజయనగరం అర్బన్: భారతీయ విజ్ఞానం (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్) పరిరక్షణగా చేపడుతున్న కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీతో స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన వర్సిటీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇరు వర్సిటీల వీసీలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం గిరిజన వర్సిటీ వీసీ కట్టిమణి మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం ఉమ్మడి పరిశోధనలు, సదస్సులు, సామాజిక ప్రచార కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు, శిక్షణ, సమాచార మార్పిడి వంటి అంశాల్లో కలసి పనిచేస్తామని, గిరిజన, గ్రామీణ మహిళలు వివిధ రంగాల్లో ఆదాయం పొందేందుకు గల అవకాశాలకు ప్రాముఖ్యత ఇస్తామని వివరించారు. సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.కె.మహంతి మాట్లాడుతూ సమాజహితానికి అవసరమైన ప్రాజెక్టులను చేపడతామన్నారు. వర్సిటీల రిజిస్ట్రార్‌లు టి.శ్రీనివాసన్, పి.పల్లవి మాట్లాడుతూ గిరిజనులకు లబ్ధి చేకూరేలా వారి ఆరోగ్యం, విద్య, జీవన విధానం, సామాజిక ఆర్థిక అంశాలపై వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగును నింపే విజయగాథలను సృష్టిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ ఏఓ డాక్టర ఎన్‌వీఎస్ సూర్యనారాయణ సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో వర్సిటీ డీన్ ఎం.శరత్‌చంద్రబాబు, జితేంద్రమోహన్ మిశ్రా, విభాగాధిపతులు దేవికారాణి, పి.శ్రీదేవి, బి.కోటయ్య, ఎల్.వి.అప్పసాబా, కె. సురేష్‌బాబు, కె.దివ్య, నగేష్, ప్రేమచటర్జీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment