వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడి కృతజ్ఞతలు
కొమరాడ: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కొమరాడ వైస్‌ఎంపీపీ నంగిరెడ్డి శరత్‌బాబు మాజీ డిఫ్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చినమేరంగిలోని పార్టీ కార్యాలయం వద్ద బుధవారం వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు.
చిల్లర దుకాణం దగ్ధం
సీతంపేట: స్థానికంగా వారపు సంత వద్ద గొర్లె ప్రకాశరావు నిర్వహిస్తున్న చిల్లర దుకాణం సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. దుకాణంలో ఉన్న గ్రైండర్, ఫ్రిడ్జి, గ్యాస్ స్టౌ, పరుపు, ద్విచక్రవాహనంతో పాటు, రూ.30 వేల నగదు, పలు చిన్నచిన్న వస్తువులు అగ్నికి ఆహుతి కాగా దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు ప్రకాశరావు వాపోయాడు. సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
సంక్రాంతి సంబరాల్లో హైకోర్టు జడ్జి
మెరకముడిదాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి చీమలపాటిరవికుమార్ ఆయన సొంత గ్రామం భైరిపురంలో గ్రామస్తులు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి నుంచి నేరుగా భైరిపురం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులను పలకరిస్తూ అందరి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలువురు పేదలకు దుస్తు లను పంపిణీ చేశారు. అలాగే మేలుకొలుపు బృందం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గదేని అయన పలువురు భక్తులకు స్వయంగా వడ్డించారు. తన సొంతగ్రామానికి సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఆయనను పలువురు గ్రామపెద్దలు దుశ్శాలువాలతో సన్మానించారు. సాయంత్రం వరకూ గ్రామంలో తన సొంత ఇంటివద్ద గడిపిన జడ్జి ఆయన కుటుంబసభ్యులు సాయంత్రం విశాఖపట్నానికి బయల్దేరి వెళ్లిపోయారు.
రూ 25 కోట్ల మద్యం అమ్మకాలు
విజయనగరం క్రైమ్: జిల్లాలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సుమారు రూ.25 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగేశారు. జిల్లా కేంద్రంలోనే రూ.మూడున్నర కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అనధికార బెల్ట్‌షాపులపై దాడులు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ముక్కనుమను పురస్కరించుకుని మద్యం వ్యాపారం మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
కోడిరామ్మూర్తికి ఘనంగా నివాళి
శ్రీకాకుళం న్యూకాలనీ: కలియుగ భీముడిగా కితాబు అందుకున్న కోడి రామ్మూర్తినాయుడు(కేఆర్‌ఎన్) వర్ధంతిని బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని కోడిరామ్మూర్తి విగ్రహానికి డీఎస్‌డీవో డాక్టర్ కె.శ్రీధర్‌రావు, కోచ్‌లు గాలి అర్జున్‌రావురెడ్డి, ఇప్పిలి అప్పన్న, కై లాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోదిహీన్ హాజరై కోడి రామ్మూర్తినాయుడు విగ్రహానికి నివాళ్లర్పించారు. ఇండియన్ హెర్క్యులస్‌గా పేరొందిన కోడిరామ్మూర్తి శ్రీకాకుళం జిల్లా వాసి కావడం సిక్కోలుకు గర్వకారణమన్నారు. తెలుగురువారే కాకుండా యావత్ భారతదేశం గర్వించదగ్గ మల్లయోధుడు కోడిరామ్మూర్తి అని డాక్టర్ గుండబాల మోహన్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment