మరోసారి మోసం చేయొద్దు
భామిని: అధికారంలోకి వచ్చిన వెంటనే ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. అధికారం చేపట్టాక రైతుల సమస్యను పట్టించుకోవడం మానేశారు.. ఆందోళనకు దిగితే ఏనుగులు నష్టపరిచిన పంటలను చూసేందుకు వస్తున్నారు... మమ్మలను మరోసారి మభ్యపెట్టి మోసం చేయొద్దు.. తక్షణమే ఏనుగులను తరలించే ఏర్పాట్లు చేయాలంటూ భామిని మండలంలోని ఘనసర రైతులు కూటమి నేతలను డిమాండ్ చేశారు. ఏనుగులు నాశనం చేసిన పంటలను చూసేందుకు వచ్చిన పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రైతులు ప్రశ్నించేవరకు పంట నష్టపరిహారంపైన, ఏనుగుల తరలింపుపైన స్పందించకపోవడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు బత్తిలి ఎస్సై అనీల్‌కుమార్ సర్దిచెప్పారు. ఎమ్మెల్యేతో ఒక్కసారి మాట్లాడాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకుంటామని చెబుతూ అక్కడే ఉన్న పాలకొండ, కురుపాం ఫారెస్ట్ రేంజర్లు రామారావు, గంగరాజులకు సూచనలు చేశారు. రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో కోరారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
ఎమ్మెల్యేను అడ్డుకున్న ఘనసర రైతులు
ఏనుగుల సమస్య పరిష్కరించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment