భార్య, బ్యాంకు అధికారుల వేధింపులు
● యువకుడి ఆత్మహత్య ● అల్గునూర్‌లో ఘటన
● మృతుడు మంచిర్యాల జిల్లావాసి
తిమ్మాపూర్: కట్టుకున్న భార్య, లోన్ తీసుకున్న బ్యాంకు అధికారులు వేధించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్గునూర్ శివారులో శనివారం జరిగింది. ఎల్‌ఎండీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండెపల్లికి చెందిన దామనపల్లి జగదీష్(34) చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మినీ ట్రక్కు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అవసరాల నిమిత్తం కరీంనగర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. వాయిదాలు సరిగ్గా చెల్లించకపోవడంతో లోన్ కట్టాలని అధికారులు వేధించసాగారు. దీంతోపాటు భార్య సైతం కుటుంబ విషయాలై వేధిస్తోంది. మనస్తాపం చెందిన జగదీశ్ ఈనెల13న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ పక్కన ఉన్న చెట్ల పొదల్లో ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ వివేక్, బ్లూకోల్డ్స్ సిబ్బంది నరేశ్, లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య, బ్యాంకు అధికారి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడివద్ద సూసైడ్ నోట్ లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
గురుకులం ప్రిన్సిపాల్ సస్పెన్షన్
● కాస్మోటిక్ చార్జీలు కాజేశారని విద్యార్థుల ఆందోళన
● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్‌సీవో అంజలి
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులం ప్రిన్సిపల్ మమతపై చర్యలు చేపట్టాలని విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. గతంలో కాస్మోటిక్ చార్జీలు కాజేశారని, తమపై దురుసుగా ప్రవర్తించారని, ఆమెను సస్పెండ్ చేసేవరకూ ఆందోళన చేపడతామని మొండికేశారు. దీంతో కరీంనగర్ ఆర్‌సీవో అంజలి లక్ష్మీపూర్‌కు చేరుకున్నారు. విద్యార్థులను సముదాయించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాల్సిందేనని వారు భీష్మించుకోవడంతో ఆర్‌సీవో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సైదులు ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ మమతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరె స్టు
వీణవంక(హుజూరాబాద్): వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామానికి చెందిన బొంగోని పవన్‌సాయి, నర్సింగాపూర్‌కు చెందిన బుర్ర శ్రీనాథ్ గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జమ్మికుంట సీఐ రవి వివరాలు వెల్లడించారు. పవన్‌సాయి, శ్రీనాథ్ ఈ నెల 14న మహారాష్ట్రలోని బల్లార్షా వెళ్లి రూ.22వేల విలువ చేసే 1.135కిలోల గంజాయి కొనుగోలు చేసి రాత్రి ఘన్ముక్కులకు చేరుకున్నారు. ఈ నెల 15న కోర్కల్ గ్రామంలో విక్రయించేందుకు బైకుపై వెళ్తుండగా రెడ్డిపల్లి గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, సిబ్బంది ఉన్నారు.
జల్సాలకు అలవాటు పడి..
బొంగోని పవన్‌సాయి, శ్రీనాథ్ జల్సాలకు అలవాటుపడ్డారు. సిగరేట్, మద్యం, గంజాయి తాగుతూ డబ్బుల కోసం గంజాయిని ఇతరులకు అమ్మేవారు. పవన్‌సాయి 2023లో గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరకడంతో కేసు నమోదైంది. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా తీరు మారకుండా మళ్లీ గంజాయికి అలవాటు పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment