6 గంటల్లో వ్యాధి నిర్ధారణ
● పేషెంట్ మొబైల్‌కు ఫలితాల మెసేజ్
● సత్వర సేవలు అందిస్తున్న టీ–హబ్
● రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన ‘పెద్దపల్లి’
మెరుగైన సేవలు లక్ష్యం
డయాగ్నొస్టిక్ సేవలు అందించడంలో పెద్దపల్లి టీ హబ్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 6.8 గంటల్లో ఫలితాలు అందిస్తున్నాం. సిబ్బంది, వైద్యాధికారులకు అభినందనలు. అయితే ప్రస్తుత సమయాన్ని 4 గంటలకు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పల్లెల నుంచి టీ హబ్‌కు నమూనాలతో చేరే వాహనాల రూట్‌మ్యాప్ మార్చి సమయం ఆదా అయ్యేలా చూడాలి.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
పెద్దపల్లిరూరల్: వైద్య రంగంలో సాంకేతికతతో కూడిన సేవలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాధుల బారినపడి వైద్య చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా, ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వమే వారికిఅన్నిరకాల వైద్యసేవలు అందిస్తోంది. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వ్యాధుల నిర్ధాణకు టీ హెబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలోనే పెద్దపల్లి టాప్..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టీ హబ్ సత్వర సేవలు అందించడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత అక్టోబర్‌లో 6.8 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందించి టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో నిర్మల్, సూర్యాపేట, గద్వాల, జనగాం, ఉట్నూరు, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాలు నిలిచాయి. సిద్దిపేట జిల్లా 25.3 గంటల్లో ఫలితాలు అందిస్తూ చిట్టచివరన నిలిచింది.
వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు
కాలానుగుణ, జ్వరాలు, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ఆరోగ్య సబ్ సెంటర్లు, మహిళా ఆరోగ్య ఆస్పత్రులను ఆశ్రయించే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చికిత్స అందించేందుకు వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకం. ఇందుకోసం టి హబ్ (తెలంగాణ డయాగ్నొస్టిక్స్) ద్వారా వ్యాధులను నిర్ధారిస్తున్నారు. ఇందులో ఆధునిక యంత్ర పరికరాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. ఇందులో సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సకాలంలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అంతేకాదు.. పేషెంట్ల మొబైల్ నంబరుకు ఫలితాలను మెసేజ్‌ల ద్వారా శరవేగంగా చేరవేస్తున్నారు.
అందుబాటులో 56 సేవలు..
టీహబ్ ద్వారా 139 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ప్రస్తుతం పెద్దపల్లి టీ హబ్‌లో 56 రకాల సేవలే అందుబాటులో ఉన్నాయి. గుండె, కిడ్నీ, లివర్, థైరాయిడ్ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) నుంచి సేకరించిన రక్త నమూనాలను వాహనాల ద్వారా టీహబ్‌కు చేరవేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడి ల్యాబొరేటరీల్లోని టెక్నీషియన్లు పరీక్షలు చేసి ఫలితాలను అందిస్తున్నారు.
సిబ్బంది కొరత ఉన్నా..
జిల్లా కేంద్రంలోని టీ హబ్‌లో అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం టీ హబ్‌లో పనిచేస్తున్న వారిపై కొంత పనిభారం పడుతోంది. మొత్తం నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. అలాగే ల్యాబ్‌టెక్నిషియన్ల కొరత కూడా వేధిస్తోంది. అయితే, అవసరాన్ని బట్టి జిల్లా అధికారులే డెప్యుటేషన్‌పై కొందరు సిబ్బంది, వైద్యులను ఇక్కడకు పంపిస్తూ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఆటంకం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment