జిల్లాస్థాయి జూడో పోటీలకు స్పందన
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో బుధవారం కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి జూడో సబ్ జూనియర్స్, కెడెట్స్ బాలబాలికల ఎంపిక పోటీలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు ఈ పోటీలను మానేరు విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో జూడో పోటీలకు మానేరు విద్యాసంస్థలు నిలయంగా మారాయన్నారు. జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను ఈనెల 29, 30ల్లో కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జరిగే 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు జిల్లా ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి సిలివేరి మహేందర్, యోగా సంఘం బాధ్యులు ఎల్వీ రమణ, గోలి సుధాకర్, శ్రీధర్, ప్రాంతీయ క్రీడా పాఠశాల కోచ్ బి.సాయిరాంయాదవ్, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment