యాజమాన్యానిదే బాధ్యత
సీహెచ్‌పీని కమ్మేసిన బూడిద
గోదావరిఖని: కాలిన బొగ్గు వాసన ఒకవైపు, బూ డిద, దుమ్ము, ధూళి మరోవైపు.. స్థానిక సీహెచ్‌పీ కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతకాలంగా సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టంగా విధులు..
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2 పరిధి లోని ఓసీపీ–3 సీహెచ్‌పీలో బొగ్గు చూర విపరీతంగా విడుదలవుతోంది. క్వారీలో కాలుతున్న బొగ్గును షావల్ ద్వారా డంపర్లలో నింపి సీహెచ్‌పీకి తరలిస్తున్నారు. ఈ సమయంలో బొగ్గుచూర, బూడిద విపరీతంగా లేచి గాలిలో కలుస్తోంది. దీంతో కార్మికులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళి విపరీతంగా వెలువడుతుండడంతో తాము విధులు నిర్వహించడం కష్టంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా ఉన్న మనుషులు, వాహనాలు, ఇతరత్రా ఏవీ కూడా కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
ధ్వంసమవుతున్న కాంక్రీట్ స్ట్రక్చర్..
16 వేల టన్నుల సామర్థ్యంగల బంకర్‌లో ఫైర్‌కోల్ వేడితో కాంక్రీట్ స్ట్రక్చర్ పగిలి పోతోంది. దీనిద్వారా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. కేవలం బొగ్గు రవాణాపైనే దృష్టి సారించిన అధికారులు.. యాజమాన్యం.. కార్మికుల ప్రాణాల రక్షణ, సంక్షేమం విస్మరిస్తున్నారని అంటున్నారు. ఫీడర్‌లో గత 4 నెలలుగా మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచి అందులో కార్మికులు పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా ఫ్లోఫీడర్‌లో వాటర్ సంప్ క్లీన్ చేయాలని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. నీళ్లు నిల్వచేసిన దాంట్లోనే విద్యుత్ కేబుళ్లు కూడా వేస్తున్నారని, ఇవి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని కార్మికులు వివరించారు.
యూనిఫామ్‌లపైనే దృష్టి..
రక్షణ చర్యలకు సంబంధించి యూనిఫామ్ వేసుకున్నారా? లేదా? పట్టపగలు రేడియం జాకెట్ ధరించారా? లేదా? అని మాత్రమే అధికారులు ఆరా తీస్తున్నారు. కానీ, కార్మికుల పని ప్రదేశాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయా? రక్షణతో కూడుకుని ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకునే ఓపిక అధికారులకు లేకుండాపోయిందని కార్మికులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తిబాధ్యత యాజమాన్యానీదే అని పేర్కొంటున్నారు. కాగా, బూడిద, దుమ్ము, ధూళి సమస్యపై సంబంధిత శాఖ అధికారులను సంప్రదిస్తే.. కోల్‌యార్డులో కాలుతున్న బొగ్గు మంటల్ని ఆర్పేందుకు నీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మరో ఐదురోజుల్లో నీటి పైపులైన్ నిర్మాణం పూర్తిచేసి, సమస్య పరిష్కరిస్తామని వారు వివరించారు.
కార్మికులు ఉక్కిరిబిక్కిరి
రక్షణ చర్యలు విఫలమైతే యాజమాన్యం పూర్తి బాధ్యత. సీహెచ్‌పీలో విపరీతమైన దుమ్ముతో కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈవిషయంలో యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు సీహెచ్‌పీని సందర్శించాలి. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– ఆర్జీ–2 కార్యదర్శి జిగురు రవీందర్
సీహెచ్‌పీ దుమ్ము, ధూళితో సతమతం
వ్యాధుల బారిన పడుతున్న కార్మికులు
పట్టించుకోని సింగరేణి యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment