మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు
ఏలూరు(మెట్రో): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమే ప్రధాన కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తమ పార్టీకే చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఏలూరులో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన జిల్లా డేటా కేంద్రాన్ని మంత్రి రాంబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మూడు ప్రశ్నలు వేస్తున్నానని, విభజన చట్టం ప్రకారం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని టీడీపీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందని, ప్రాజెక్టును 2018లోగా పూర్తిచేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని, కాఫర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టారని అంబటి ప్రశ్నించారు.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, డయాఫ్రమ్ వాల్ ఏమేర దెబ్బతిన్నదన్న విషయాన్ని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మించడంలో తప్పిదంతో పాటు.. భారీ వర్షాలు, వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో ఉందని అంబటి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment