సాక్షి,విశాఖపట్నం: ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని, చంద్రబాబు, లోకేశ్, పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు, జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే తమ పార్టీ విధానమని చెప్పారు. అసలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందే చంద్రబాబని చెప్పారు. హోదా కాదు ప్యాకేజీ చాలు అంటూ కేంద్ర పెద్దలతో స్వీట్లు పంచుకుని శాలువాల్ని కప్పించుకుంది చంద్రబాబేనని తెలిపారు.
ఆరోజు అదో గొప్ప వేడుకలా ఈ సిగ్గులేని పచ్చ మీడియా ఎందుకు రాసిందన్నారు. ఆయన దత్తపుత్రుడు, సెలబ్రిటీ పవన్ కూడా దీనిపై బాబును నిలదీయాలన్నారు. చంద్రబాబు హయాంలోనే పేదల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలను అందరూ చూశారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేదలు ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిని సాధించి మెరుగైన జీవనశైలితో సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో తిరుగుతున్న బాబు, లోకేశ్, పవన్ ఏ ఒక్కచోటైనా అప్పటి, ఇప్పటి ప్రభుత్వాల పాలనలో వ్యత్యాసాన్ని పోల్చి చూపారా అని ప్రశ్నించారు. తమని చెప్పమంటే 100 తేడాలు చెబుతామన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు లక్షల కోట్లు దోచేస్తున్నారని అసత్య ఆరోపణలు చేసి సమాధానం చెప్పమంటే.. ఏ చెబుతామని అన్నారు. కాలేజీకి సైకిల్ మీద వెళ్లినోడు చంద్రబాబని, తాను అప్పట్లోనే స్కూటర్ మీద కాలేజీకి వెళ్లానని చెప్పారు. రెండెకరాలతో హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు అన్ని లక్షల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో ఈ దత్తపుత్రుడు అడగొచ్చుకదా అని అన్నారు. హైదరాబాద్‌లో నివసించే పవన్ ఆంధ్ర గురించి, అందులో ఒక కొండ గురించి అంతగా ఎందుకు బాధ పడుతున్నాడని ప్రశ్నించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీ కొండ మీద కాకుండా నేలమీద ఉందా? వైజాగ్‌లోనే రామానాయుడు స్టూడియో కొండమీద లేదా? అనేక నిర్మాణాలు కొండలపై లేవా? అని నిలదీశారు. రుషికొండ మీద నిబంధనల ప్రకారమే టూరిజం ఆధ్వర్యంలో అన్ని అనుమతులతో ప్రభుత్వ భవనాల్నే కడుతున్నామని చెప్పారు. చంద్రబాబు మాదిరిగా అనుమతుల్లేకుండా కట్టిన ప్రజావేదిక కాదన్నారు.
జగన్‌ను చూసి నేర్చుకొంటే పవన్ పైకొస్తాడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల హృదయాల్లో ఉన్నారని, ఈ సెలబ్రిటీ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి ఆశపడి పార్టీ పెట్టి అద్భుతాల్ని సృష్టిస్తానంటూ కలలు కంటే ఏమీ జరగదన్నా రు. జగన్‌కు మంచి వ్యక్తిత్వం, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉన్నాయని, లక్ష్య సాధనలో కష్టాల్ని ఎదుర్కొనే దమ్ముందని చెప్పారు.
పేదల రక్తాన్ని పీల్చే జలగ రామోజీ
తాను మంత్రిగా ఉండగా రామోజీరావు ఎన్నో అస త్య కథనాలు రాశారని, ఆ రకంగా ఈనాడు పత్రిక తమకు చాలా ప్రచారం చేస్తుందని చెప్పారు. అందుకు రామోజీకి ధన్యవాదాలు తెలిపారు. తమకు అడ్డగోలుగా ప్రభుత్వం భూముల్ని కేటాయించిందని ఆధారాలతో నిరూపిస్తే వాటిని రామోజీ రావుకు రాసిస్తానన్నారు.
దమ్ముంటే రామోజీ తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఆయన 2006లో కూడా తన మీద పరువు నష్టం దావా వేశాడని, ఆ తర్వాత తప్పయిందని విత్‌డ్రా చేసుకున్నారన్నారు. పేదల రక్తాన్ని పీల్చే జలగలాంటి రామోజీలా అందరూ కొండలు, గుట్టల్ని దోచుకుంటున్నట్లు అనుకుని అసత్య కథనాలు రాస్తుంటాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment