సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. ఎన్నికల సన్నద్ధత, ప్రచారం తదితరాలపై దృష్టి సారిస్తూనే అభ్యర్తుల ఎంపిక పైనా కసరత్తు జరుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కేవలం గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
అవసరమైన చోట సిట్టింగులను కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు క్షేత్ర స్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు.
1న కేసీఆర్ అభిప్రాయ సేకరణ
గత ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మెజారిటీ సీట్ల సాధనపై కన్నేసిన బీఆర్‌ఎస్.. ఇప్పటికే రాష్ట్రంలోని లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరిలో 10లోగా 119 అసెంబ్లీ నియోజవకర్గాల్లోనూ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. మరోవైపు కాలుజారి పడి ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత పార్టీ కీలక నేతలతో ముఖాముఖి భేటీ జరపడంతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు.
ఇప్పటికే చేవెళ్ల (రంజిత్‌రెడ్డి), జహీరాబాద్ (బీబీ పాటిల్), ఖమ్మం (నామా నాగేశ్వర్‌రావు) లోక్‌సభ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలకే మరోమారు టికెట్ ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ సంకేతాలు ఇచ్చింది. కరీంనగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయడం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజవర్గాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూలులో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఆశావహుల జాబితా పెద్దదే
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి, మెదక్ సహా విపక్షాల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి పట్టున్న మెదక్ టికెట్‌ను సుమారు అరడజను మంది ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఆర్.సత్యనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా టికెట్ అడుగుతున్నారు.
మల్కాజిగిరిపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, విద్యా సంస్థల అధినేత నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడెం నగేశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆరూరు రమేశ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు, మహబూబాబాద్ జెడ్పీలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. నల్లగొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
నాగర్‌కర్నూలు నుంచి ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడు భరత్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని మార్చే పక్షంలో మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశముంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నాయకుడు మోతె శోభన్‌రెడ్డి (డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత భర్త) పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి టికెట్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు పట్నం కమలాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దరఖాస్తు అందజేశారు.
అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్!
Published Tue, Jan 30 2024 5:53 AM | Last Updated on Tue, Jan 30 2024 10:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment