దివాళా అంటూ దిక్కుమాలిన ప్రచారం | KTR Comments on Congress Party: TG | Sakshi
Sakshi News home page

దివాళా అంటూ దిక్కుమాలిన ప్రచారం

Published Wed, Oct 23 2024 6:12 AM | Last Updated on Wed, Oct 23 2024 6:12 AM

KTR Comments on Congress Party: TG

అప్పులు.. వనరులు.. ఆర్థిక నిర్వహణలో తెలంగాణ టాప్‌

ఆరు గ్యారంటీలు అమలు చేయలేక బీఆర్‌ఎస్‌పై విష ప్రచారం

రాష్ట్ర ఆదాయం తగ్గి..కాంగ్రెస్‌ నేతల ఆదాయం పెరుగుతోంది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రం దివాళా అంటూ దిక్కుమాలిన ప్రచారం చేస్తోందని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. వనరులు.. అప్పులు.. ఆర్థిక నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక కేసీఆర్‌పై కాంగ్రెస్‌ బురద చల్లుతోందన్నారు.

తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అర్థం లేని వ్యాఖ్యలతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు నివేదికలు, కాగ్‌ గణాంకాలు, ఆర్థిక మండలి నివేదికలు, ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ తెలంగాణ ఆర్థిక సౌష్టవం, పటిష్టతను పదేపదే నిరూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేళ్లుగా తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలో అగ్రస్థానంలోనే ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటకుండా అప్పుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించిందన్నారు. 

నీచ ప్రచారాలను సహించేది లేదు
తన వ్యక్తిత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. తన వ్యక్తిత్వ హననం చేసేలా ప్రధాన మీడియాతోపాటు సోషల్‌ మీడియాలో చేసే నీచ ప్రయత్నాలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. రాజకీయ విమర్శల పేరిట ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసేవారికి కొండా సురేఖపై వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, కాంగ్రెస్‌ నాయకుల ఆదాయం భారీగా పెరుగుతోందన్నారు. 

అదుపు తప్పిన శాంతిభద్రతలు
కొద్ది నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని జనం చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. ఇకనైనా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని చెప్పారు. పోలీసు ఉన్న తాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గతేడాది అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఐటీ పార్క్‌ టవర్‌ పనులు 11 నెలలుగా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement